Chandrababu Naidu: రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత నాది
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:57 PM
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. నంద్యాలలో నీటి సమస్య పరిష్కారం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

నంద్యాల: రాయలసీమ చరిత్రలో ఈరోజు (జూలై 17) ఒక శుభదినంగా నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నంద్యాల (Nandyal) పర్యటన సందర్భంగా అన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను రాయలసీమకు నీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేసిన ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేనంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాయలసీమ దిశా దశను మార్చేది నీరు అని సీఎం ప్రస్తావించారు. గతంలో రాయలసీమలో నీటి కొరత వల్ల వేరుశనగ పంటలు ఎండిపోయినప్పుడు, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి ఆదుకున్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు. కాగా, మల్యాల వద్ద హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి మూడు పంపుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు.
రాయలసీమకు జీవనాడి
పశువులకు గడ్డి లేనప్పుడు, ఇతర ప్రాంతాల నుంచి గడ్డి తెప్పించి వాటి ఆకలి తీర్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని మొట్టమొదట ఆలోచించిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆలోచనలను సాకారం చేసిన ఏకైక వ్యక్తి కూడా ఎన్టీఆరే అని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేశామన్నారు. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం.. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.
సీఎం అభినందనలు
రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యమంత్రి. ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్-2 పనులు పూర్తి చేద్దామని, నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారని, సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకు అందించాలనే సంకల్పాన్ని అందరి సహకారంతో నేరవేరుస్తామన్నారు. ఈ క్రమంలో రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
జగన్ ప్రభుత్వంపై..
ఇదే సమయంలో గత జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్, ఐదేళ్లలో రాయలసీమను విధ్వంసం చేశారన్నారు. హంద్రీ-నీవాకు పది పైసలు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. కులాలు, మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని, అలాంటి నాయకులు రాజకీయాలకు అనర్హులని విమర్శించారు. ఇకపై రాయలసీమకు నీటి కష్టాలు ఉండవన్నారు. ఈ ప్రాంతం రతనాల సీమగా మారుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయ విమర్శలు
గత ప్రభుత్వం రోడ్లను గోతుల మయంగా మార్చిందని, మామిడి కాయలను రోడ్డుపై పారబోసి విధ్వంసం సృష్టించిందని చంద్రబాబు విమర్శించారు. రౌడీ మూకలు తోక జాడిస్తే కట్ చేస్తామని హెచ్చరించారు. రాయలసీమలో ముఠా కక్షలు లేకపోతే, ఈ ప్రాంతం దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతిని నిర్మిస్తామని, ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు నదుల అనుసంధానం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వేదవతి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని, గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్‌ల మరమ్మతులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
అనంతపురంలో కియా ప్లాంట్: పట్టుదలతో అనంతపురంలో కియా ప్లాంట్‌ను తీసుకొచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఓర్వకల్లులో డ్రోన్స్ హబ్: ఓర్వకల్లును దేశంలోనే డ్రోన్స్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
నందికొట్కూరు అభివృద్ధి: మిడ్తూర్ వద్ద రూ.60కోట్లతో లిఫ్ట్ నిర్మాణం, నందికొట్కూరులో 100 పడకల ఆసుపత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మామిడి కొనుగోలు: చిత్తూరు జిల్లాలో రైతుల నుంచి రూ. 270 కోట్లతో మామిడి కొనుగోలు చేశామని తెలిపారు.
నిరుద్యోగ భృతి: నిరుద్యోగ యువతకు భృతి అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి ఐదు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి