Share News

CM Chandrababu: మహిళలకు పంద్రాగస్టు కానుక

ABN , Publish Date - May 18 , 2025 | 03:20 AM

మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన సీఎం చంద్రబాబు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా పలు పథకాలు ప్రకటించారు.

CM Chandrababu: మహిళలకు పంద్రాగస్టు కానుక

  • ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

  • జూన్‌లో ‘తల్లికి వందనం’.. ఖాతాల్లోకి నగదు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

  • రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు

  • గ్రీన్‌ ఎనర్జీ, హార్టికల్చరల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

  • మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం

  • 175 నియోజకవర్గాల్లో 175 రైతు బజార్లు

  • ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర

  • అందరూ భాగస్వాములు కావాలి

  • కర్నూలు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో సీఎం

  1. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుడతాం. జూన్‌లో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. బడులు తెరిచిన వెంటనే ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ ఖాతాల్లో నగదుజమ చేస్తాం.

  2. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా, హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత నాది. రాయలసీమ గడ్డపైనే నేను పుట్టాను. ఈ ప్రాంత బిడ్డగా అది నా బాధ్యత. పెద్దఎత్తున గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తాం.

    - సీఎం చంద్రబాబు

  3. వచ్చే నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విశాఖకు రానున్నారు. ప్రపంచ దేశాలు గుర్తుంచుకునేలా, భారతదేశం గర్వించేలా యోగా ఉత్సవాలు నిర్వహిస్తాం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

కర్నూలు, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పింఛన్‌ రూ.వెయ్యి పెంచామని, ఏడాదికి రూ.36 వేల కోట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. పాణ్యం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజావేదిక సభలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర లక్ష్యసాధనలో మమేకం కావాలని, పర్యావరణ పరిరక్షణ కోసం చేయీ చేయీ కలిపి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ‘ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతున్నాం.


మన ఇల్లు, పరిసరాలు శుభ్రపరచాలి. పల్లెలు, పట్టణాలు, చెరువులు, పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాలయాల్లో స్వచ్ఛాంధ్ర నిర్వహించాలి. మూడో శనివారం ఎవరూ ఆఫీసుల్లో పని చేయవద్దు. ఆఫీసును శుభ్రం చేసి పచ్చని చెట్ల కింద విశ్రాంతి తీసుకోవాలి. గత ప్రభుత్వం పట్టణాల్లో 85 లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది. ఇప్పటికి 55 లక్షల టన్నులు తొలగించాం. ఇంకా 30 లక్షల చెత్త రోడ్లపైనే ఉంది. అక్టోబరు 2నాటికి రాష్ట్రంలో చెత్త లేకుండా చేయాలని మంత్రి నారాయణకు చెప్పాను. జపాన్‌లో రోడ్లపై చిన్న పేపర్‌ ముక్క కూడా వేయకుండా బాధ్యతగా వ్యవహరిస్తారు. మనం కూడా అలవాటు చేసుకోవాలి. చెత్త నుంచి ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులు రాష్ట్రంలో రెండు ఉన్నాయి. రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలో కూడా ఈ ప్రాజెక్టులు రాబోతున్నాయి. వీటివల్ల పట్టణాల్లో 90 శాతం చెత్త విద్యుత్‌గా మారుతుంది. ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు యోగా కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తాం’ అని అన్నారు.

175 రైతు బజార్లు

‘రైతుకు మంచి ధర, వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందించాలని 1998లో రైతు బజార్లను నేనే ప్రారంభించా. కూరగాయలు తీసుకువచ్చేందుకు పల్లెవెలుగు బస్సులు ప్రారంభించా. దళారి బెడద లేకుండా చేశాను. రూ.6 కోట్లతో కర్నూలు సీ క్యాంపు రైతుబజార్‌ను ఆధునీకరిస్తాం. రాష్ట్రంలో 125 రైతుబజార్లు ఉన్నాయి. వీటిని ఆదర్శ రైతుబజార్లుగా తయారు చేస్తాం. 175 నియోజకవర్గాల్లో 175 రైతుబజార్లు ఏర్పాటుచేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, ప్రజలకు సరసమైన ధరలకు కూరగాయలు అందిస్తాం’ అని చంద్రబాబు అన్నారు.


పల్లెల్లో పుష్కరిణి కార్యక్రమం

‘పల్లెల్లో పుష్కరిణి కార్యక్రమానికి శ్రీకారంచుడుతూ చెరువులను శుభ్రం చేయబోతున్నాం. చెరువుల గట్లపై పచ్చదనం పెంపకంతో పాటు వాకింగ్‌ ట్రాక్‌లుగా ఆధునికీకరిస్తాం. 123 మున్సిపాలిటీల్లో ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశాం. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓడీఎఫ్‌ ప్లస్‌గా నిలిచాయి. 15,995 గ్రామాలను 2026 మార్చి నాటికి ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాయలసీమకు పరిశ్రమలు తెచ్చి పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే పలు పరిశ్రమలు వచ్చాయి. కరువు రక్కసి నుంచి సీమ ప్రజలను కాపాడాలంటే ఉద్యాన పంటలకు పెద్దపీట వేయాలి. ప్రస్తుతం 15 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఐదేళ్లలో 36 లక్షల హెక్టార్లకు పెంచుతాం. మైక్రో ఇరిగేషన్‌ కోసం ప్రతి రైతుకు 10 ఎకరాల వరకు 90శాతం సబ్సిడీ ఇస్తాం’ అని చంద్రబాబు వివరించారు.


గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా సీమ

‘రాయలసీమ గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారబోతోంది. సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తి ఈ ప్రాంతంలో చేస్తున్నాం. పెద్దఎత్తున గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించబోతున్నాం. ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఇండస్ట్రియల్‌ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నాం’ అని అన్నారు. ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే రాయలసీమకు గేమ్‌ చేంజర్‌ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 76 ప్రాజెక్టులు తెచ్చాం. రూ.4.96 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 4.51 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.పల్లెల్లో సోలార్‌ వెలుగులు నింపుతాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇళ్లపై సోలార్‌ పవర్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. డ్వాక్రా, పొదుపు మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. చెత్త నుంచీ కంపోస్టు ఎరువు తయారు చేయాలి. తద్వారా సంపదను సృష్టించాలి’ అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్‌, టీజీ భరత్‌ పాల్గొన్నారు.


కీరదోస కొని.. ఫోన్‌ పే

ర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతు బజార్‌లో చంద్రబాబు పర్యటించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి గంటకు పైగా రైతుబజార్‌ మొత్తం కలియతిరిగారు. రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను పరిశీలించారు. ఓ మహిళా రైతు వద్దకు వెళ్లి కిలో కీరదోసను కొనుగోలు చేసి ఫోన్‌పే ద్వారా రూ.40 చెల్లించారు. ‘ఏమ్మా.. ఫోన్‌ పే ద్వారా డబ్బు పంపించా. వచ్చిందో.. లేదో? చూసుకో’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ధనలక్ష్మినగర్‌లో రూ.50లక్షలతో జయరాజ్‌ ఇస్పాత్‌ సంస్థ నిర్మించనున్న స్వచ్ఛాంధ్ర పార్కుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పచ్చదనం-పరిశుభ్రతలో భాగంగా మొక్కలు నాటారు.


వ్యర్థానికి అర్థం

వ్యర్థాల రీ సైక్లింగ్‌పై బుద్ధ్దుడి కథ కనువిప్పు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సభలో సీఎం చెప్పిన కథను సభికులు ఆసక్తిగా విన్నారు. ‘ఓ రోజు బుద్ధుడు తన శిష్యులతో సమావేశం అవుతారు. ప్రపంచంలో అందరి గురించి ఆలోచించే మీరు.. మీ శిష్యుల సంక్షేమంపై కొంచెం దృష్టి పెట్టాలని ఓ శిష్యుడు కోరుతాడు. నీకేం కావాలని బుద్ధుడు అడగానే.. తన దుస్తులు పూర్తిగా చిరిగిపోయాయని, బయటకు వెళితే అందరు హేళనగా చూస్తున్నారని, తనకు కొత్త బట్టలు కావాలని శిష్యుడు కోరుతాడు. సరే అని బుద్ధుడు కొత్త దుస్తులు ఇవ్వగా.. శిష్యుడు తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. కొన్నాళ్లకు శిష్యుడిని పిలిపించి తాను ఇచ్చిన కొత్త దుస్తుల గురించి బుద్ధుడు అడుగుతారు’ అని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా బుద్ధుడు, శిష్యుడి మధ్య జరిగిన సంభాషణ చంద్రబాబు మాటల్లోనే...

బుద్ధుడు: కొత్త బట్టలు ఎలా ఉన్నాయి?

శిష్యుడు: చాలా బాగున్నాయి.. ఆనందంగా ఉంది.

బుద్ధుడు: పాత బట్టలు ఏం చేశావు?

శిష్యుడు: నా పడక బొంతగా చేసి వాడుతున్నాను.

బుద్ధుడు: పాత బొంత ఏమైంది?

శిష్యుడు: వంట గదిలో వేడి పాత్రలు దించేందుకు మసిగుడ్డగా వాడుతున్నాను.

బుద్ధుడు: అప్పటి వరకు ఉన్న మసిగుడ్డను ఏం చేశావు?

శిష్యుడు: గదిలో బండలు తుడిచేందుకు వాడుతున్నా.

బుద్ధుడు: ఇదివరకే ఉన్న బండలు తుడిచే గుడ్డ ఏమైంది?

శిష్యుడు: ఆ గుడ్డ పూర్తిగా చిరిగిపోవడంతో దారాలు తీసి.. ఒత్తిగా చేసి దీపం వెలిగిస్తున్నాను. గురువా..! మీ ముందు వెలుగుతున్న దీపం ఒత్తి ఆ గుడ్డ దారాలతో చేసిందే.

ప్రపంచంలో ప్రతి వస్తువు రీ సైక్లింగ్‌ చేయడం ద్వారా మళ్లీ ఉపయోగించుకోవచ్చు అని చెప్పేందుకు ఈ కథ చెప్పానని చంద్రబాబు వివరించారు.

Updated Date - May 18 , 2025 | 06:04 AM