Share News

Chandrababu Birthday Celebrations: చంద్రబాబు ఓ డిక్షనరీ

ABN , Publish Date - Apr 21 , 2025 | 05:27 AM

అమరావతి నిర్మాణానికి చంద్రబాబు అనివార్యుడని నేతలు అభినందిస్తూ, ఆయన అసెంబ్లీ ప్రసంగాలను రెండు పుస్తకాలుగా ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిపారు

Chandrababu Birthday Celebrations: చంద్రబాబు ఓ డిక్షనరీ

  • అమరావతి నిర్మాణం ఆయనతోనే సాధ్యం: కేంద్ర మంత్రి పెమ్మసాని

  • చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): అమరావతి వంటి మహానగరం నిర్మించాలంటే అది ఒక్క చంద్రబాబుకే సాధ్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. చంద్రబాబు అంటేనే నిలువెత్తు డిక్షనరీ అని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయన్ను అనుసరించడం ద్వారా ఎంతో లబ్ధి పొందానని పెమ్మసాని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ఆయన చేసిన ప్రసంగాలపై రెండు పుస్తకాలను అసెంబ్లీ కమిటీ హాలులో ఆదివారం ఆవిష్కరించారు. జయప్రద ఫౌండేషన్‌ తరఫున టీడీ జనార్దన్‌, విక్రమ్‌ పూల ఈ పుస్తకాలను రూపొందించారు. 1995-2003 మధ్య అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ప్రసంగాలను ఓ పుస్తకంగా, 2004-2014 మధ్య ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రసంగాలను మరో పుస్తకంగా రూపొందించారు. మొదటి పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆవిష్కరించి ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు అందించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు 70 మీటర్లకు కేంద్రం ఆమోదం తెలిపితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు పట్టుబట్టి 140 మీటర్లకు కావాలని సాధించారని, ఆయన దూరదృష్టికి ఇలాంటి ఉదాహరణలు కొన్ని వందలు చెప్పొచ్చని అన్నారు.


చంద్రబాబులో గాంధీజీలో ఉండే ఓర్పు: రఘురామ

దురభిమానులు లేకుండా మంచి అభిమానులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు ఈ పుస్తకావిష్కరణలో అన్నారు. ఆయనలో.. గాంధీజీలో ఉండే ఓర్పు, సహనం చూస్తామని, కానీ ఒక్కోసారి సుభాష్‌ చంద్రబోస్ లోలా విప్లవధోరణి భయటపడుతుందని కొనియాడారు. ‘ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పినా అలా వింటూ ఉండిపోతారు. ఆ కొత్త విషయం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తారు. ఆయన నిత్య విద్యార్థి’ అని చెప్పారు. ఆయన విజన్‌ను బద్ధ వ్యతిరేకులైనా ఇష్టపడాల్సిందేనన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ప్రయ త్నం చేసిన టీడీ జనార్ధన్‌ ప్రశంసనీయులన్నారు. చంద్రబాబు ప్రపంచస్థాయి ఆలోచనలు స్థానికంగా అమలు చేయగల సత్తా ఉన్న నాయకుడని సీనియర్‌ జర్నలిస్టు ఎస్‌.వెంకటనారాయణ అన్నారు. విద్యార్థులు, రైతులు, కార్యకర్తలతో మాట్లాడినట్టు పెద్ద సంస్థల సీఈవోలతో అలవోకగా మాట్లాడతారని, ముఖ్యమంత్రే కాదు ఆర్కిటెక్ట్‌ కూడా అని ప్రశంసించారు.


చంద్రబాబు వ్యక్తి కాదు.. వ్యవస్థ: అచ్చెన్న

చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యక్తి కాదని.. ఒక వ్యవస్థ అని అన్నారు. గౌడ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వీరంకి గురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డూండీ రాకేశ్‌ ఏర్పాటు చేసిన 75 కేజీల కేక్‌ను నాయకులు కట్‌ చేశారు. అనంతరం ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభిరామ్‌, అశోక్‌బాబు, నన్నపనేని రాజకుమారి, గురజాల మాల్యాద్రి, వీవీవీ చౌదరి, ఏవీ రమణ, కోమటి జయరాం, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటక అకాడమీ చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ.. చంద్రబాబుపై రాసిన పాటను, ఆయన రాజకీయ ప్రస్థానంపై టీడీ జనార్దన్‌ రూపొందించిన ఫొటోలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.


ఘనంగా టీడీపీ అధినేత పుట్టిన రోజు వేడుకలు

  • రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల సేవా కార్యక్రమాలు

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణతో కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కేక్‌ కట్‌ చేశారు. 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విజయనగరం పైడితల్లమ్మ ఆలయంలో పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ గజపతినగరంలో రక్తదానం చేశారు. అనంతరం జిల్లా టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయనతోపాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. భారీ కేక్‌లను కట్‌ చేసి,సేవా కార్యక్రమాలు చేపట్టారు. మసీదులు, ఆలయాలు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఢిల్లీలో టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు.


dsfff.jpg

భారత రాజకీయాల్లో లెజెండ్‌: బుద్దా వెంకన్న

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలోని వన్‌టౌన్‌ రథం సెంటర్‌లో ఆదివారం చంద్రబాబు పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు భారీ కటౌట్‌ను ఏర్పాటుచేసి పూలాభిషేకం చేశారు. బుద్దా వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబు నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి అన్నారు. దేశ రాజకీయాల్లో ఒక ఐకాన్‌ లెజెండ్‌ అని, తామంతా చంద్రబాబు వెంటే నడుస్తామని, ఆయన ఆదేశాలు మాకు శిరోధార్యమని పేర్కొన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పదవిలో ఉన్నా, లేకపోయినా చంద్రబాబు కోసమే పనిచేస్తారంటూ బుద్దా వెంకన్నను అభినందించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా తదితరులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి..

Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 05:27 AM