Banakacharla Project: బనకచర్లపై కొర్రీ
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:54 AM
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘాన్ని సీడబ్ల్యూసీ సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దానితో కలిసి వరద జలాల లభ్యతపై మరింత సమగ్రంగా అంచనా వేయాలని తెలిపింది.

ఈ ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలున్నాయ్: కేంద్రం
గోదావరి ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధమంటూ ఫిర్యాదులందాయ్
వీటిపై జలసంఘాన్ని సంప్రదించండి
వరద జలాల లభ్యతపైనా సమగ్రంగా అంచనా వేయండి
ఏపీ ప్రభుత్వానికి ఈఏసీ సూచన
టీవోఆర్ రూపకల్పనకు నిరాకరణ
బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వెనక్కి
రాష్ట్ర జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తి
లోతుగా చర్చించాక కార్యాచరణ ఖరారు
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రం ఆదిలోనే కొర్రీ వేసింది. ఇందులో అంతర్రాష్ట్ర సమస్యలు ఇమిడి ఉన్నాయని తెలిపింది. 1980నాటి గోదావరి జలవివాదాల ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డును ఉల్లంఘించేలా ఉందని పలు ఈ-మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయని కేంద్ర పర్యావరణ-అటవీ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) స్పష్టంచేసింది.
న్యూఢిల్లీ/అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలసంఘాన్ని (సీడబ్ల్యూసీ) సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. దానితో కలిసి వరద జలాల లభ్యతపై మరింత సమగ్రంగా అంచనా వేయాలని తెలిపింది. టెర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ (టీవోఆర్) రూపకల్పనకు నిరాకరిస్తూ.. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల ఫైలును తిప్పిపంపింది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ 2005 జనవరి 25వ తేదీన పర్యావరణ క్లియరెన్సు ఇచ్చిందని.. అయితే ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌లలో ముంపు సంబంధిత సమస్యల కారణంగా ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని ఈఏసీ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సమస్యల పరిశీలనకు, అనుమతులు, క్లియరెన్సుల కోసం జలసంఘాన్ని ఆశ్రయించడం తప్పనిసరని స్పష్టంచేసింది. అనుమతులన్నీ తీసుకున్నాక టీవోఆర్ రూపకల్పనకు మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని సోమవారం ఢిల్లీలో జరిగిన ఈఏసీ 33వ సమావేశంలో రాష్ట్రప్రభుత్వానికి సూచించింది. ఈ భేటీకి ఈఏసీ చైర్మన్ జీజే చక్రపాణి, కమిటీ సభ్యులు ఉదయ్‌కుమార్ ఆర్‌వై, జేవీ త్యాగి, కార్తీక్ సప్రే, అజయ్‌కుమార్ లాల్, రాకేశ్ గోయల్, బలరాం కుమార్, శాస్త్రవేత్త యోగేంద్రపాల్ సింగ్ హాజరయ్యారు.జలవనరుల శాఖ గుర్రు.. ఈఏసీ తీరుపై ఏపీ జలవనరుల శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. పర్యావరణ సమస్యలు ఉన్నాయో లేదో పరిశీలించకుండా.. తన పరిధిలో లేని అంతర్రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ ప్రాజెక్టు ఫైలును తిప్పిపంపడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తోంది.
సముద్రంపాలయ్యే 3 వేల టీఎంసీల్లో కేవలం 200 టీఎంసీలను వరద సమయంలో రాష్ట్రం పరిఽధిలో మాత్రమే వాడుకుంటే అంతర్రాష్ట్ర సమస్యలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తోంది. ‘జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ముంపుపై ఇప్పటికే కేంద్రం ఆయా రాష్ట్రాలతో సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. నేరుగా ప్రధాని మోదీయే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఒడిసా, ఛత్తీస్‌గఢ్ సీఎంలతో చర్చిస్తున్నారు. పోలవరం నుంచి నీరు నేరుగా సముద్రంలోకే పోతోంది. సముద్రంలోకి వెళ్లే నీటిని మా రాష్ట్రం సరిహద్దులోనే వాడుకుంటే.. అంతర్రాష్ట్ర సమస్య ఎందుకొస్తుంది?’ అని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చిన్న చిన్న విషయాలకు కూడా పర్యావరణ శాఖ కొర్రీలు వేయడం సహజమేనని.. కానీ ఈ-మెయిల్స్‌లో పలు ఫిర్యాదులు అందాయంటూ ఫైలును తిప్పి పంపుతున్నామని చెప్పడం ఏమిటని సాగునీటి రంగ నిపుణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈఏసీ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ స్థాయిలో కూలంకషంగా చర్చించి తదుపరి కార్యాచరణ ఖరారుచేస్తామని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.