GST Office: గుంటూరుకు సెంట్రల్ జీఎస్‌టీ కార్యాలయం
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:44 AM
సెంట్రల్ జీఎస్‌టీ (ఆడిట్) కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నట్లు కమిషనర్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ఆర్థిక దోపిడీపై చర్యలు తీసుకుంటూ, బిల్డర్లపై ప్రత్యేక దృష్టి సారించారు

రాజధానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం
భూమి కొని అవసరమైన భవనాలు నిర్మిస్తాం
ఏపీలో తిరుపతి సర్కిల్ నుంచి ఎక్కువ ఆదాయం
కమిషనర్ ఆనంద్‌కుమార్ వెల్లడి
విశాఖపట్నం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని సెంట్రల్‌జీఎస్‌టీ (ఆడిట్) కార్యాలయాన్ని గుంటూరుకు తరలించనున్నట్లు కమిషనర్ ఆనంద్‌కుమార్ పులపాక తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు. గుంటూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన మూడు ఎకరాల భూమి ఉందని, దానిని కొనుగోలు చేసి.. అక్కడ కార్యాలయంతో పాటు సిబ్బందికి క్వార్టర్స్, ఇతర అవసరమైన భవన సముదాయాలు నిర్మిస్తామన్నారు. మరోవైపు ఏపీలో తిరుపతి సర్కిల్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తోందని, అక్కడ కియా మోటార్స్ ఉండడమే అందుకు కారణమని ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. విశాఖలో స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్ వంటివి ఉన్నప్పటికీ, 2024-25లో వాటి ఉత్పత్తి తగ్గడం వల్ల తిరుపతి సర్కిల్ ఆదాయంలో ముందుందని తెలిపారు.
ఆ యూనిట్లపై ఆడిట్లు తగ్గించాం
2025-26 ఆర్థిక సంవత్సరంలో పన్ను ఎగవేతదారుల నుంచి రూ.300 కోట్లు రికవరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆనంద్ తెలిపారు. రాష్ట్రంలో సెంట్రల్ జీఎ్‌సటీ చెల్లించేవారు 1,81,000 మంది, స్టేట్ జీఎ్‌సటీ చెల్లించేవారు సుమారు 2 లక్షల మంది ఉన్నారని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వృద్ధి చెందాలనే ఉద్దేశంతో వాటిపై ఆడిట్లు తగ్గించామని పేర్కొన్నారు. వీటి తనిఖీలు 2023-24లో 4,140 ఉండగా, 2024-25లో 135కే పరిమితం చేశామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ వ్యాపార సంస్థలు 1,510 కోట్లు పన్ను ఎగవేసినట్టు గుర్తించి, 150 కోట్లు రికవరీ చేశామన్నారు. అంతకు ముం దు ఏడాదితో పోల్చుకుంటే రికవరీ 100% పెరిగిందన్నారు.
పన్ను ఎగవేతదారుల్లో 20% మంది బిల్డర్లే
తప్పుడు లెక్కలు చూపించి పన్ను ఎగవేసే వారిలో 20 శాతం మంది బిల్డర్లే ఉన్నారని ఆనంద్‌కుమార్ తెలిపారు. వారికి గతంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ 18 శాతం వరకు క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు ఉండేదని, దానిని ఐదు శాతానికి కుదించామన్నారు. బిల్డర్లు నిర్మించిన అపార్ట్‌మెంట్లు/విల్లాలకు స్థానిక కార్పొరేషన్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తే.. కొనుగోలుదారులు జీఎస్‌టీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే ఎక్కడైనా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినప్పుడు జీఎస్‌టీతో కూడిన ఇన్వాయిస్ డిమాండ్ చేయాలని కొనుగోలుదారులకు సూచించారు. దీనివల్ల వ్యాపారి పన్ను ఎగవేయడానికి వీలుండదన్నారు. రాష్ట్రాలు పన్నులు, సెస్ వంటివి వేయడం వల్ల పెట్రోల్ రేటు ఎక్కువగా ఉందని, వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తేవడానికి రాష్ట్రాలు అంగీకరిస్తే ధరలు దిగివస్తాయన్నారు.