Health Department: చాపకింద నీరులా క్యాన్సర్
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:21 AM
రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా క్యాన్సర్ బాధితులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నారు. గతేడాది నవంబరు నుంచి ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ 3.0 పేరిట క్యాన్సర్ స్ర్కీనింగ్ సర్వే నిర్వహించగా.. రాష్ట్రంలో 2 లక్షల మందిని అనుమానితులుగా గుర్తించారు.

రాష్ట్రంలో అనుమానితులు 2 లక్షల మంది
ఎన్‌సీడీ స్ర్కీనింగ్ సర్వేలో వెల్లడి
పదేళ్లల్లో రెట్టింపైన బాధితులు
ప్రస్తుతం 56 వేల మందికి చికిత్స
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏటా క్యాన్సర్ బాధితులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నారు. గతేడాది నవంబరు నుంచి ఆరోగ్యశాఖ అన్ని జిల్లాల్లో ఎన్‌సీడీ 3.0 పేరిట క్యాన్సర్ స్ర్కీనింగ్ సర్వే నిర్వహించగా.. రాష్ట్రంలో 2 లక్షల మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 8.55 శాతం మందికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. గత పదేళ్లతో పొల్చితే రాష్ట్రంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య రెట్టింపైనట్టు సర్వేలో తేలింది. 2014-15లో 25,330 మంది క్యాన్సర్ బాధితులు ఉండగా.. 2024-25లో ఆ సంఖ్య 56,458కి పెరిగింది. ఈ లెక్కలు గమనిస్తే రాష్ట్రంలో క్యాన్సర్ ఎంత ప్రమాదకర స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 2.84 కోట్ల మందికి క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు చేయగా.. వారిలో దాదాపు 2 లక్షల మందిలో అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో 117 మందికి క్యాన్సర్ ప్రాణాంతక దశలో ఉన్నట్టు గుర్తించారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి: నోరి దత్తాత్రేయ
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి సరైన సమయంలో చికిత్స అందిస్తే ఈ ప్రాణాంతక వ్యాధిని అరికట్టవచ్చనే విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ సూచించారు. మంగళవారం సచివాలయంలో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన సర్వేను ఆయన అభినందించారు. వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సకు ఉన్న సౌకర్యాలు, ప్రజలకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. కొన్ని ప్రధాన ఆస్పత్రులను క్యాన్సర్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని సూచించారు. విశాఖపట్నంలో కింగ్ జార్జ్ ఆస్పత్రి, టాటా ట్రస్ట్ ఆస్పత్రి, గుంటూరు, కర్నూలు, తిరుపతిలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులను క్యాన్సర్ చికిత్సకు ప్రధాన హబ్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వివిధ క్యాన్సర్ పరీక్షలు, చికిత్స సేవలు, ఇతర సమాచారంతో ఒక డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని డాక్టర్ నోరి ప్రభుత్వానికి సూచించారు.