Share News

High Court: బుడమేరు వరదతో తీవ్రనష్టం

ABN , Publish Date - Jul 03 , 2025 | 05:06 AM

విజయవాడలో వరదల కారణంగా ప్రాణనష్టం జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

High Court: బుడమేరు వరదతో తీవ్రనష్టం

  • దానికి బాధ్యులైన అధికారులను గుర్తించండి

  • ముప్పును అడ్డుకొనే వ్యవస్థను బలోపేతం చేయండి

  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

  • పిల్‌పై కౌంటర్‌కు మరికొంత సమయం మంజూరు

అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): విజయవాడలో వరదల కారణంగా ప్రాణనష్టం జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరద ముప్పును అంచనా వేసి, దానిని అడ్డుకొనేందుకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. బుడమేరు వరదపై ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)లో కౌంటర్‌ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది. వ్యాజ్యంలో వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను అక్టోబరు 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


కృష్ణా నదితో పాటు కొండవీటివాగు, బుడమేరు ప్రవాహాలకు అవరోధంగా ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపునకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒంగోలుకు చెందిన విశ్రాంత పాత్రికేయుడు నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అక్రమ నిర్మాణంలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నారని, అందువల్లఆయన్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చానని చెప్పారు. సీఎంకు నోటీసులు జారీ చేయాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని వాదనలు వినిపించవద్దని సూచించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్ జీ పీ) ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ప్రకృతి విపత్తు వల్ల వరదలు సంభవించాయని, అందుకు అధికారులను బాధ్యులను చేయలేమన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని చెప్పారు.

Updated Date - Jul 03 , 2025 | 05:06 AM