Share News

Anantapur District: బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభం

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:34 AM

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌ కోడిపల్లి గ్రామ సమీపంలోని భైరవాన్‌ తిప్ప కాలువ పనులను ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం పునఃప్రారంభించారు.

 Anantapur District: బీటీపీ కాలువ పనులు పునఃప్రారంభం

బ్రహ్మసముద్రం, జూలై 5(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం వెస్ట్‌ కోడిపల్లి గ్రామ సమీపంలోని భైరవాన్‌ తిప్ప కాలువ పనులను ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు శనివారం పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు. గత టీడీపీ(2014-19) హయాంలో జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హంద్రీనీవా నీటిని భైరవాన్‌తిప్ప ప్రాజెక్టుకు తరలించేందుకు రూ.968 కోట్లు మంజూరు చేశారు. 2019 వరకు ఈ పనుల్లో 30 శాతానికి పైగా పూర్తయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పనులను అటకెక్కించారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టడంతో ఈ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. గతంలో కేటాయించిన రూ.968 కోట్ల నిధులతోనే పెండింగు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. కాలువ వద్ద పూజలు నిర్వహించి, జేసీబీతో మట్టిని తీసి ఎంపీ, ఎమ్మెల్యేలు శనివారం పనులను పునఃప్రారంభించారు. ఈ పనులు పూర్తి అయితే బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కల్యాణదుర్గం నియోజకవర్గంలో 114 చెరువులకు నీరు అందుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయ బోరుబావుల్లో నీటి నిల్వలు పెరగనున్నాయి. వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కాలవ, అమిలినేని మాట్లాడారు. బీటీపీ కాలువ పనుల విషయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించి పనుల పునఃప్రారరంభానికి అనుమతి తీసుకున్నామని తెలిపారు. కల్యాణదుర్గం నుంచి ఎన్నికై, మంత్రిగా పనిచేసిన వైసీపీ నాయకురాలు ఉష శ్రీచరణ్‌ ఈ ప్రాంతంలో దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారని, ప్రాజెక్టు గురించి, రైతుల కష్టాల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. సీమ సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, హంద్రీనీవాకు బడ్జెట్‌లో రూ.3,800 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. హంద్రీనీవా పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు.

Updated Date - Jul 06 , 2025 | 03:35 AM