Share News

Collector Nagalakshmi: అమ్మ చనిపోదామంటోంది మేడం

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:29 AM

పదేళ్ల బాలుడి జీవన పోరాటం కలెక్టర్‌నే కదిలించింది. గుండె జబ్బుతో బాధపడుతూ..

Collector Nagalakshmi: అమ్మ చనిపోదామంటోంది మేడం

  • గుంటూరు కలెక్టర్‌ను కదిలించిన పదేళ్ల బాలుడు

  • జీజీహెచ్‌ వద్ద టిఫిన్‌ బండి ఏర్పాటుకు విజ్ఞప్తి

  • ఆ మేరకు ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్‌ నాగలక్ష్మి

గుంటూరు తూర్పు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): పదేళ్ల బాలుడి జీవన పోరాటం కలెక్టర్‌నే కదిలించింది. గుండె జబ్బుతో బాధపడుతూ.. పోషణ భారమైన కుటుంబానికి తనే పెద్ద దిక్కయ్యాడు. తొలగించిన తమ టిఫిన్‌ బండి పెట్టుకోవడానికి జీజీహెచ్‌ వద్ద చిన్న చోటు ఇస్తే.. జీవనాధారం లేక చనిపోదామనుకుంటున్న అమ్మ ఆలోచనను మార్చి బతుకు ‘బండి’ ఈడుస్తామని ఆ చిన్న చేతులు.. జిల్లా అధికారికి అర్జీ అందించాయి. స్థానిక వెంకట్రావ్‌ పేటకు చెందిన యశ్వంత్‌ అనే బాలుడు.. సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిసి తమ సమస్య విన్నవించాడు. ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు విస్తరణ కారణాలతో నగర పాలక సంస్థ అధికారులు గతంలో జీజీహెచ్‌ వద్ద టిఫిన్‌ బండ్లను తొలగించారని, ఆ తర్వాత ప్రజాప్రతినిధుల సిఫారసుతో కొంత మంది బండ్లను మళ్లీ ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు. అయితే తమకు మాత్రం అనుమతి ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయాడు.


తన తల్లి రాధిక అధికారులను కలిసినా ఫలితం లేదని ఆవేదన చెందాడు. తమ కుటుంబానికి జీవనాధారమైన బండిని తొలగించడంతో పోషణ భారమైందని చెప్పాడు. ఇప్పటికే తాను గుండె జబ్బుతో బాధపడుతున్నానని, తనకు 16 ఏళ్లు వచ్చిన తర్వాత శస్త్రచికిత్స నిర్వహిస్తామని వైద్యులు చెప్పారని కలెక్టర్‌కు వివరించాడు. నెలకు రూ.6 వేల వరకు మందులకే అవసరమని పేర్కొన్నాడు. వీటిని దృష్టిలో పెట్టుకుని జీజీహెచ్‌ మరో ద్వారం వద్ద రైల్వేస్టేషన్‌ గేటు పక్కన టిఫిన్‌ బండి ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. బాలుడి విజ్ఞాపన కలెక్టర్‌ను కదిలించింది. వేగంగా స్పందించిన కలెక్టర్‌ బాలుడు అడిగిన చోటే బండి ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు.

Updated Date - Jul 01 , 2025 | 02:29 AM