Share News

Railway Station: గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పెచ్చులూడి పడి బాలుడి మృతి

ABN , Publish Date - May 24 , 2025 | 04:00 AM

గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్లాట్ఫామ్ పై పెచ్చులు పడుతూ 7 ఏళ్ల మణికంఠ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది.

Railway Station: గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పెచ్చులూడి పడి బాలుడి మృతి

  • గుంతకల్లులో విషాదం

  • తలకు తీవ్ర గాయాలై దుర్మరణం

గుంతకల్లు, మే 23(ఆంధ్రజ్యోతి): రైల్వేశాఖ నిర్లక్ష్యం అభంశుభం తెలియని ఓ పసివాడి ప్రాణాన్ని బలి తీసుకుంది. గుంతకల్లు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంపై పెచ్చులు ఊడి తలపై పడడంతో మణికంఠ (7) అనే బాలుడు మృతి చెందాడు. కర్నూలుకు చెందిన బ్యాంకు ఉద్యోగి వెంకటేశ్వర్లు కుటుంబంతో తమిళనాడులోని రామేశ్వరం తదితర పుణ్యక్షేత్రాల సందర్శనకు బయల్దేరాడు. వారు ఎక్కాల్సిన అహ్మదాబాద్‌-తిరుచినాపల్లి ప్రత్యేక రైలు (నంబర్‌ 09419) శుక్రవారం ఉదయం 6:40 గంటలకు గుంతకల్లు స్టేషన్‌కు వస్తుంది. దీంతో గురువారం రాత్రికే వారు కర్నూలు నుంచి గుంతకల్లు చేరుకున్నారు. పదిమంది కుటుంబ సభ్యులు రైల్వేస్టేషన్‌లోని 7వ నంబరు ప్లాట్‌ఫాంపై పడుకున్నారు. అయితే గోడపక్కన నిద్రిస్తున్న మణికంఠ తలపై తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గోడకు ఉన్న ప్లాస్టింగ్‌ పెచ్చు ఊడి పడింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు బాలుడిని జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ పోలీసుల సహకారంతో తొలుత రైల్వే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పల్స్‌ రేట్‌ తక్కువగా ఉండటం, బాలుడు కోమాలోకి వెళ్లడంతో స్థానిక వైద్యులు అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అనంతపురంలోని కిమ్స్‌ సవీరా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మణికంఠ మృతిచెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యంకారణంగానే బాలుడు మరణించాడని సీపీఐ, సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు.

Updated Date - May 24 , 2025 | 04:02 AM