వక్ఫ్ సవరణలపై ప్రతిపక్షాల అసత్య ప్రచారం: బీజేపీ
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:17 AM
వక్ఫ్ చట్ట సవరణపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నేత అరవింద్ మీనన్ విమర్శించారు. వక్ఫ్ సవరణలు పేద ముస్లింల హక్కుల రక్షణకోసం తీసుకువచ్చినవని చెప్పారు

అమరావతి, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): దేశంలోని 97% మంది పేద ముస్లింల సొమ్ము కేవలం మూడు శాతం మంది ధనిక ముస్లింలు దోచేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ మీనన్ అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వక్ఫ్ బిల్లు సవరణ కేంద్రం ఎందుకు చేసిందో వివరించారు. దేశంలోని ముస్లింలకు బీజేపీ ద్రోహం చేసిందంటూ ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాపులో వక్ఫ్ చట్టం గురించి పార్టీ శ్రేణులకు వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ... ‘ధార్మిక వ్యవస్థ అయిన వక్ఫ్‌తో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. బిల్లుకు సవరణలు చేస్తే విపక్షాలకు వచ్చిన నష్టమేంటి? బీజేపీ అధికారంలో లేనప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు నమోదయింది. ఆ కేసులో బెయిలుపై ఉన్న సోనియా, రాహుల్ బీజేపీపై బురద జల్లడం విడ్డూరంగా ఉంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో వాటాలను యంగ్ ఇండియా తీసుకుంది. అందులో 76 శాతం వాటాదారులు సోనియా, రాహుల్. ఇదే విషయాన్ని ఈడీ చార్జిషీట్‌లో తెలిపింది’ అన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నేతలు షేక్ బాజీ, వల్లూరు జయప్రకాశ్ నారాయణ, పాతూరి నాగభూషణం, సయ్యద్ బాషా పాల్గొన్నారు.