PVN Madhav: జాతీయ వాదంతో జనంలోకి..
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:17 AM
జాతీయవాదం లేని గ్రామం లేదు. బీజేపీ వాసన లేని వీధి లేదు. సబ్ కా సాథ్... సబ్ కా వికాస్..

కూటమిగానే స్థానిక ఎన్నికల్లో పోటీ
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో లాబీ: పీవీఎన్ మాధవ్
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘జాతీయవాదం లేని గ్రామం లేదు. బీజేపీ వాసన లేని వీధి లేదు. సబ్ కా సాథ్... సబ్ కా వికాస్.. అంటూ ప్రతి ఇంటికీ వెళతాం. రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపల్ని చూడటమే లక్ష్యం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి ఆయన కొందరు పాత్రికేయులతో బుధవారం విజయవాడలో తన ఆలోచనలు పంచుకున్నారు. ‘దేశంలో ఏ పార్టీకైనా బలోపేతం అవ్వాలన్నదే లక్ష్యంగా ఉంటుంది. మేం అందుకు అతీతం కాదు. అయితే దేశ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యం. అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఽఢిల్లీ పెద్దలతో లాబీయింగ్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ బీజేపీ కృషి చేస్తుంది. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వంతో కలసి కృషి చేస్తాం. కూటమి పార్టీలు ఉమ్మడిగానే స్థానిక సంస్థల్లో అభ్యర్థుల్ని పోటీకి దించుతాయి. బీజేపీ శ్రేణులకు సముచిత ప్రాధాన్యం ఉంటుంది. మరో మూడేళ్లలో అమరావతి, పోలవరం పూర్తి చేసి ప్రజల మెప్పు పొందుతాం’ అని అన్నారు.