BJP: బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:52 AM
బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి ఇదీ రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తల్లో గత కొన్ని రోజులగా జరుగుతున్న చర్చ.

నేడు షెడ్యూల్.. జూలై 1న ఫైనల్
అధ్యక్ష పీఠం కోసం ఆశావహుల క్యూ
సుజనా, పార్థసారథి, మాధవ్ యత్నం
రేసులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
పురందేశ్వరి కొనసాగింపుపైనా చర్చ
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ‘‘బీజేపీ రాష్ట్ర సారథి ఎవరు?. పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి.’’ ఇదీ.. రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తల్లో గత కొన్ని రోజులగా జరుగుతున్న చర్చ. ఎట్టకేలకు ఈ చర్చకు ముగింపు పలుకుతూ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ శనివారం విజయవాడలో ప్రకటన చేశారు. ఆదివారం(29వ తేదీ) షెడ్యూల్ విడుదల చేస్తామని, 30న నామినేషన్లు స్వీకరించి అదే రోజు సాయంత్రానికి ఉపసంహరణ గడువు విధిస్తామని చెప్పారు. జూలై 1న రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. అదే రోజు సా యంత్రం నూతన అధ్యక్షుడి పేరు వెల్లడిస్తామని చెప్పారు. అయితే, ఈ ఏడాది జనవరి ఆఖర్లో జరగాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పార్లమెంటు సమావేశాలు, పహల్గాం ఉగ్రదాడి తదితర కారణాలతో వాయిదా పడింది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల అధ్యక్షులతోపాటు జాతీయ అధ్యక్షుడిని కూడా తాజాగా ఎన్నుకోనున్నారు. 2023, జూలైలో రాష్ట్ర బీజేపీ సారథ్యం చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరిని కూడా మార్చబోతున్నట్లు పార్టీలో కొందరు చెబుతుండగా ఆమెను కొనసాగించే అవకాశం లేకపోలేదనే వారూ ఉన్నా రు.
గత సెప్టెంబరు నుంచి నవంబరు వరకు పార్టీ సభ్యత్వం పూర్తి చేసి గ్రామ, వార్డు, మండల కమిటీలు పూర్తి చేశాక జిల్లాల అధ్యక్షుల నియామకం కూడా పూర్తి అయింది. మరో వైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని జాతీయ నాయకత్వం నియమించడం దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు పది మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షురాలి సామాజిక వర్గానికి చెందిన సుజనా చౌదరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని, పార్టీకి నిధుల కొరత కూడా ఉండబోదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అయితే, బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలనే వాదనతో పార్థసారథి పేరు ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణకు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు సారథి కోసం జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక, రాయల సీమకు చెందిన బీసీ నాయకుడికి మంత్రి(సత్య కుమార్) పదవి, రెండు రాజ్యసభకు సీట్లు కూడా బీసీ(ఆర్. కృష్ణయ్య, పాకా సత్యనారాయణ)లకే ఇచ్చినందున మరో బీసీ నేతకే రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇస్తారా.? అనే చర్చ కూడా నడుస్తోంది. అదే ప్రామాణికతను పాటిస్తే ఉత్తరాంధ్ర నుంచి పీవీఎన్ మాధవ్ లాంటి వారిని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్యులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న రాష్ట్ర పార్టీ సహ ఇన్‌చార్జి శివప్రకాశ్‌కు కొందరు ఆశావాహులు తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. అయితే, బీజేపీ జాతీయ నాయకులు మాత్రం ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మరోవైపు రాష్ట్ర మంత్రి సత్య కుమార్ మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేయడం గమనార్హం. ఇదిలావుంటే, సీమకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎలాంటి పదవీ దక్కలేదు. వైసీపీని కట్టడి చేసేందుకు, రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కిరణ్‌కుమార్ వంటి వారికి అవకాశం ఇచ్చే చాన్స్ లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.