BJP Rajya Sabha Candidate: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:52 AM
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు

సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు
భీమవరానికి చెందిన బీసీ నేతకు అవకాశం
ప్రస్తుతం పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్
45 ఏళ్లుగా పార్టీకి సేవలు.. విధేయుడిగా పేరు
నేడు కూటమి తరఫున నామినేషన్ దాఖలు
అమరావతి/న్యూఢిల్లీ/భీమవరం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు బీజేపీ ఖాతాలో చేరనుంది. ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ (64)ను ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సోమవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జి అరుణ్ సింగ్ ఈ మేరకు ప్రకటనలో వెల్లడించారు. ఈ సీటుకు పలువురు పోటీ పడగా బీజేపీ అధిష్ఠానం మాత్రం పార్టీలో నమ్మకస్తుడిగా పేరున్న పాకా సత్యనారాయణకు పట్టం కట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా ఉన్నారు. బీసీ(గౌడ్) వర్గానికి చెందిన ఆయన దాదాపు 45 ఏళ్లుగా బీజేపీ జెండా మోస్తున్నారు. చదువుకునే రోజుల్లో భీమవరంలోని డీఎన్‌ఆర్ కాలేజీలో ఏబీవీపీలో చురుగ్గా పనిచేస్తూనే, ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత 1980లో బీజేపీలో చేరారు. భీమవరం పట్టణ పార్టీ అధ్యక్ష పదవితో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు హోదాల్లో పనిచేశారు. తొలి నుంచి పార్టీ పట్ల విధేయతతో ఉంటూ వస్తున్నారు. ప్రతి ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రణాళికలు వేస్తూ సేవలందించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరున్న సత్యనారాయణను 2021 నుంచి రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కొనసాగిస్తోంది. గత నెలలో రాష్ట్రంలో భర్తీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి నుంచి అనూహ్యంగా బీజేపీకి ఒకటి దక్కింది.
బీసీ వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు కచ్చితంగా దక్కుతుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సోము వీర్రాజుకు దానిని కేటాయించిన పార్టీ పెద్దలు.. తాజాగా రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. మంగళవారం ఆయన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి బీజేపీ తరపున ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సామాన్య కుటుంబం నుంచి..
1961లో సామాన్య రైతుకుటుంబంలో నరసింహమూర్తి, వెంకట నర్సమ్మ దంపతులకు పాకా సత్యనారాయణ జన్మించారు. ఎంఏ, బీఎల్ చదివారు. న్యాయవాది వృత్తిలో కొనసాగుతున్నారు. భార్య గృహిణి. ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బీజేపీ అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలించారు. ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యసభ సీటు సత్యనారాయణకు దక్కడంతో పశ్చిమగోదావరి జిల్లాకు రాజకీయ ప్రాధాన్యం లభించినట్టయ్యింది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఎంపీ భూపతిరాజు శ్రీనివా్‌సవర్మ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు.