Bank Employee : ఖాతాదారుల నగలు కొల్లగొట్టి..
ABN , Publish Date - Feb 23 , 2025 | 03:39 AM
కంచే చేను మేసిన చందంగా.. బ్యాంకు ఖాతాదారుల బంగారాన్ని ఆ బ్యాంకు ఉద్యోగే ఎత్తుకెళ్లాడు.

కుదువ అంగళ్లలో తనఖా పెట్టి..
యూబీఐలో రూ.2.35 కోట్లు లూటీ
తిరుపతి జిల్లా నాగలాపురంలో బ్యాంకు
బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఘరానా మోసం
డిప్యూటీ మేనేజర్, మేనేజర్‌పైనా కేసు నమోదు
ఇందులో రూ.12లక్షల నగలను బ్యాంకులోనే మళ్లీమళ్లీ కుదువపెట్టి రూ.1.34 కోట్లు కొల్లగొట్టిన వైనం
సత్యవేడు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): కంచే చేను మేసిన చందంగా.. బ్యాంకు ఖాతాదారుల బంగారాన్ని ఆ బ్యాంకు ఉద్యోగే ఎత్తుకెళ్లాడు. ఎంచక్కా.. బయట కుదువ అంగళ్లలో తనాఖా పెట్టి రూ.కోటికి పైగా లూటీ చేశాడు. మరికొందరు ఖాతాదారుల నగలను బ్యాంకులోనే వేర్వేరు బినామీల పేరిట మళ్లీ మళ్లీ కుదువ పెట్టి మరో కోటిన్నర వరకు దోచేశాడు. ఇలా మొత్తంగా నాలుగు కోట్ల విలువైన బంగారంపై రూ.రెండున్నర కోట్ల వరకు కొల్లగొట్టాడు. చివరికి ఆడిట్ తనిఖీల్లో అడ్డంగా దొరికి పోయాడు. ఈ వ్యవహారంలో మరో బ్యాంకు అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం యూనియన్ బ్యాంకులో ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. వివరాలివీ.. ఈ బ్యాంకులో అరవ సూర్యతేజ్ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 2024 మే నుంచి 2025 ఫిబ్రవరి 10వ తేదీ వరకు బ్యాంకులో బంగారు నగలపై రుణాలు పొందిన 67 మంది ఖాతాదారులకు సంబంధించిన 5,498 గ్రాముల నగలను ఎత్తుకెళ్లి మొత్తం రూ.2.35 కోట్లు కాజేశాడు. ఇందులో 30 మంది ఖాతాదారుల నగలను పుత్తూరు పరిసర ప్రాంతాల్లోని కుదువ అంగళ్లు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టి రూ.కోటీ నాలుగు లక్షలు తీసుకున్నాడు. మరో 37 మంది ఖాతాదారులకు సంబంధించిన నగలను అదే బ్యాంకు (నాగలాపురం యూనియన్ బ్యాంకు)లోనే బినామీ పేర్ల మీద రొటేషన్ పద్ధతిలో మార్చుకుంటూ కుదువ పెట్టి రూ.1.31 కోట్లు కాజేశాడు. ఇటీవల బ్యాంకులో జరిగిన ఆడిట్‌లో ఈ ఘరానా మోసం వెలుగుచూసింది.
విచారణ జరిపిన అధికారుల బృందం ఖాతాదారులు తమ అవసరాల నిమిత్తం బ్యాంకులో తనఖా పెట్టిన నగలను ఆ బ్యాంకు ఉద్యోగే లూటీ చేసినట్లు నిర్ధారించారు. యూనియన్ బ్యాంక్ తిరుపతి రీజియన్ డీజీఎం బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు డిప్యూటీ మేనేజర్ సూర్యతేజ్, మేనేజర్ శేఖర్ తిరువరాజ్‌లపై నాగలాపురం ఎస్‌ఐ సునీల్ శుక్రవారం కేసు నమోదు చేశారు.
అవే నగలు బినామీ పేర్లతో మార్చి మార్చి..
విచారణలో బ్యాంకు ఉద్యోగి నగలు కాజేసిన తీరు చూసి అధికారులకు దిమ్మతిరిగింది. డిప్యూటీ మేనేజర్ అరవ సూర్యతేజ్ ఖాతాదారుల నగలను బినామీ పేర్లతో మళ్లీ మళ్లీ బ్యాంకులోనే కుదువ పెట్టి భారీ మోసానికి పాల్పడ్డట్టు గుర్తించి విస్తుపోయారు. ఇందులో కొందరు ఖాతాదారులు తాకట్టుపెట్టిన కేవలం రూ.12 లక్షల విలువ కలిగిన నగలను 11 మంది బినామీ పేర్లతో మార్చి మార్చి కుదువ పెట్టినట్లు చూపించి రూ.1.34 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు.