Share News

Aqua Farming: ఆక్వా సాగుకు విరామం

ABN , Publish Date - Apr 28 , 2025 | 04:02 AM

పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా సాగుకు రైతులు పంట విరామం ప్రకటిస్తున్నారు. రొయ్య ధరలు తగ్గడంతో సాగుకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు

Aqua Farming: ఆక్వా సాగుకు విరామం

(భీమవరం-ఆంధ్రజ్యోతి)

పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా సాగుకు రైతులు పంట విరామం ప్రకటించాలని తీర్మానాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఆగస్టులో మూడు నెలలు సాగుకు స్వస్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు జిల్లాలో చెరువుల వద్ద పంట విరామ బోర్డులు పెట్టేశారు. రొయ్య కౌంట్‌కు గిట్టుబాటు ధర రావడం లేదన్న కారణంతో విరామానికి ముందుకొస్తున్నారు. మేత ధరలు తగ్గడం లేదంటూ మరో వాదన వినిపిస్తున్నారు. పాలకొల్లు పరిధిలోని జై భారత్‌ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పంట విరామానికి పూనుకుంది. మరోవైపు రైతులకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని, సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అధికార యంత్రాంగం రైతులతో సమావేశమై చైతన్య పరుస్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద కౌంట్‌ రొయ్య ధర రూ.270లకు చేరింది. గత ప్రభుత్వంలో రూ.240 ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వ్యాపారులు మాత్రం అంత ధరతో కొనుగోలు చేయలేదు. వంద కౌంట్‌ రొయ్య ధర రూ. 200లకు పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరిగాయి. విదేశాలకు ఎగుమతి చేసే 30-40 కౌంట్‌ రొయ్య ధర ఏకంగా రూ.470లకు చేరింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన పన్నులతో ఇక్కడ రొయ్య ధరలు మళ్లీ పడిపోయాయి. ఉద్దేశపూర్వకంగానే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారంటూ ఇటీవల జిల్లాలో రొయ్య రైతులు ధర్నాలు నిర్వహించారు.


పశ్చిమ ఆయువు పట్టు..!

పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.13 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. దానిని ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాలకు విస్తరించాలని జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళిక వేసింది. ఆక్వా సాగు మొత్తంలోని 80వేల ఎకరాల్లో రొయ్య ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన విస్తీర్ణంలో చేపలు సాగు చేస్తున్నారు. ఏటా మూడు లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తవుతున్నాయి. అమెరికా, యూరప్‌ దేశాలకు అత్యధికంగా ఎగుమతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ధర లు పెరిగినప్పుడు రైతులు ఒకింత సంతోష పడ్డారు. ఇటీవల మళ్లీ ధరలు పడిపోవడంతో పంట విరామానికి ముందుకొస్తున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 04:02 AM