River Water Issues: బనకచర్ల, కృష్ణా, గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:07 AM
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది.

కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు: నిమ్మల
సీఎంల భేటీలో 3 అంశాలపై నిర్ణయాలు
రిజర్వాయర్ల అవుట్‌ఫ్లోల వద్ద టెలిమెట్రీలు
శ్రీశైలం డ్యాంకు తక్షణమే మరమ్మతులు
అమరావతికి కృష్ణా బోర్డు, హైదరాబాద్‌లో గోదావరి బోర్డు
స్నేహపూర్వక వాతావరణంలో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు
న్యూఢిల్లీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల సమగ్ర పరిష్కారానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీ నియామకానికి రెండు రాష్ట్రప్రభుత్వాలూ అంగీకారం తెలిపాయి. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు.. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి 13 అంశాలు ఎజెండాగా బుధవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. రెండు రాష్ట్రాల మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేంద్ర, రెండు రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలకాంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి నిమ్మల విలేకరులకు వివరాలు వెల్లడించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ ఇచ్చిన ప్రతిపాదనల్లో సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నందున.. వీటి పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సాంకేతిక నిపుణులు, అధికారులతో సోమవారం(21వ తేదీ) లోపు కమిటీ ఏర్పాటు చేసుకుని రోడ్‌మ్యా్‌పను రూపొందించుకోవాలని నిశ్చయించినట్లుచెప్పారు. ఈ కమిటీ కేంద్రం ఆధ్వర్యంలో ఉంటుందన్నారు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని, వీటికి సంబంధించి రికార్డులను కమిటీ పరిశీలిస్తుందని.. కృష్ణా, గోదావరి జలాల అంశాలపై రోడ్‌మ్యాప్ రూపొందించుకున్నాక.. మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ మూడోసారి నిర్వహించడంపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు జరిగాయని.. మూడు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రిజర్వాయర్ల నుంచి కాలువలకు వెళ్లే అవుట్‌ఫ్లోల వద్ద టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలూ అంగీకరించాయన్నారు. రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాలని, ఆ ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలు వెనువెంటనే తీసుకోవాలని, ఈ విషయంలో కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం నడచుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించేందుకు, గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లోనే ఉండేందుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించినట్లు నిమ్మల చెప్పారు.