Minister Narayana: చెత్త నుంచి విద్యుత్..
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:38 AM
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు...

ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మరో 2 నెలల్లో ఎల్‌ఈడీ లైట్ల పాలసీ: మంత్రి నారాయణ
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఆరు కొత్త ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛభారత్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆ వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. ‘రాష్ట్రంలో రోజుకు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నిర్వహణ కోసం 2014-19 మధ్య చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 10 ప్లాంట్లు మంజూరు చేయగా, రెండు పూర్తయ్యాయి. 8 ప్లాంట్లను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరు ప్లాంట్లు ప్రారంభించాలని నిర్ణయించింది. నెల్లూరు, కాకినాడల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఎల్-1 కింద టెండరు ఎంపిక చేశాం. కర్నూలు, కడపలో ప్లాంట్లకు త్వరలో టెండర్లు పిలవనున్నాం. గుంటూరులో రోజుకు 1,400 టన్నుల చెత్తను విద్యుత్‌గా మార్చే ప్లాంట్ ఉన్నా.. దానికి ఒత్తిడి పెరిగింది. అందువల్ల కృష్ణా జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు బందరు లేదా ఉయ్యూరులో వెయ్యి టన్నుల సామర్థ్యం కల ప్లాంట్ కోసం స్థలాన్ని చూస్తున్నాం. తిరుపతిలో మరో ప్లాంట్‌కు ప్లాన్ చేస్తున్నాం. దీంతో 8 ప్లాంట్లు ఉంటాయి’ అని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ రోజు చెత్తను ఆరోజు మేనేజ్‌మెంట్ చేసినట్లే.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్లాంట్లు పెట్టాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై మున్సిపాలిటీలు, అర్బన్ అథారిటీలు ప్రాధాన్యం ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఎలక్ర్టానిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించేలా హైదరాబాద్‌లోని యూనిట్ నిర్వాహకులతో చర్చించి, రీజినల్ ప్లాంట్స్ పెట్టాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 1.68 లక్షల పడకలు ఉండగా, రోజుకు 17,783 కిలోల జీవ వ్యర్థాలు వస్తున్నాయన్నారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల వ్యర్థాలపై ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని, ఆక్వా వ్యర్థాలపై పాలసీ తేవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి నెలా ఒక థీమ్‌తో చెత్త నుంచి వ్యర్థాల నిర్వహణ అమలు చేస్తామని తెలిపారు. 2014-19 మధ్య 98వేల ఎల్‌ఈడీ లైట్లు మార్చగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎల్‌ఈడీ లైట్ల గురించి పట్టించుకోలేదన్నారు. మరో రెండు నెలల్లో ఎల్‌ఈడీ లైట్లపై ఒక పాలసీ తెస్తామని వెల్లడించారు. ఈ ఏడాది విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, రాజమండ్రికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయని, మిగతా మున్సిపాలిటీలు కూడా పోటీపడి స్వచ్ఛ అవార్డులు సాధించాలని సూచించారు.