పేద కుర్రాడు.. పరవశించిపోయాడు..
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:21 PM
పేదరికం ఆ కుర్రాడి చదువుకు ఆటంకంగా మారింది. చదువుకుని ఇంజనీర్ కావాలని కలలు కన్న ఆ కుర్రాడికి కాలేజీ ప్రయాణం దూరంగా, భారంగా మారింది. ప్రతీరోజూ 40 కిలోమీటర్లు సైకిల్ మీద కాలేజీకి వెళ్లి రావాలంటే మాటలు కాదు. అందుకే తన బుర్రకు పనిపెట్టి, సైకిల్‌నే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకున్నాడు.

పేదరికం ఆ కుర్రాడి చదువుకు ఆటంకంగా మారింది. చదువుకుని ఇంజనీర్ కావాలని కలలు కన్న ఆ కుర్రాడికి కాలేజీ ప్రయాణం దూరంగా, భారంగా మారింది. ప్రతీరోజూ 40 కిలోమీటర్లు సైకిల్ మీద కాలేజీకి వెళ్లి రావాలంటే మాటలు కాదు. అందుకే తన బుర్రకు పనిపెట్టి, సైకిల్‌నే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకున్నాడు. దాన్ని చూసేందుకు ఏకంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆసక్తి చూపడమే గాక, తనను కూర్చోబెట్టుకుని నడిపి, లక్ష రూపాయల ప్రోత్సాహం కూడా అందించడంతో సిద్దూ అనే ఆ కుర్రాడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ విశేషాలే ఇవి...
విజయనగరం జిల్లా తెర్లాం మండలం జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్దూ తల్లిదండ్రులు వలస కూలీలు. ఇద్దరూ చెన్నైలో పనిచేస్తూ కుమారుడిని చదివిస్తున్నారు. ఇంటర్ చదువుతున్న ఆ కుర్రాడు ఊరు నుంచి కాలేజీకి వెళ్లాలంటే ప్రతిరోజూ రాను పోను సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. రూ.80 ఖర్చు చేయాల్సిందే. ఈలెక్కన నెలకు రూ.2400 బస్సు ఛార్జీలు తప్పవు. అందుకే సిద్దూ సరికొత్త ఆలోచన చేసి, సాధారణ సైకిల్‌ను ఎలక్ర్టిక్ బైక్‌గా మార్చేశాడు. రోజుకు మూడు గంటలు ఛార్జింగ్ పెట్టి కేవలం రూ.6 ఖర్చుతో ఎంచక్కా కాలేజీకి చేరుతున్నాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలిచి అభినందించారు.
చిన్న ఆలోచనతో చక్కని ఆవిష్కరణ
సిద్దూ రాజాంలోని జీసీఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు పెరుమాళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. ఆ సమయంలో సిద్దూలో ఉన్న ఆసక్తిని చూసి ప్రోత్సహించారు సైన్స్ ఉపాధ్యాయుడు ఈశ్వరరావు. అయితే కాలేజీ స్వగ్రామైన రాజాం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజాం నుంచి కొత్తపేట.. అక్కడి నుంచి జాడవారి కొత్తవలస చేరుకోవాల్సి ఉంటుంది. అప్పటిదాకా తాను చేసిన సైన్స్ ప్రయోగాలు అతడికి గుర్తొచ్చాయి. బుర్రకు పదునుపెట్టి, సైకిల్‌కు బ్యాటరీ అమర్చాడు. ఆపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర పరికరాలను అమర్చాడు. బ్యాటరీకి రూ.15 వేలు, ఇతర సామగ్రికి మరో రూ.20 వేలు ఖర్చుపెట్టి రూ.35 వేలతో సరికొత్తగా సైకిల్ బైక్‌ను తయారుచేశాడు. రోజుకు 3 గంటల పాటు ఛార్జింగ్ చేస్తే ఎంచక్కా 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. చిన్నప్పటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ అవ్వాలన్నదే తన ధ్యేయమంటున్నాడు సిద్దూ. భవిష్యత్‌లో ఆవిష్కరణలు చేసే ఇంజనీర్‌గా సేవలందిం చాలన్నదే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు.
ఆన్‌లైన్‌లో చూసి...
ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసేందుకు ఆన్‌లైన్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నానని సిద్దూ చెప్పాడు. ఈ మధ్యకాలంలో పలు కంపెనీలు తయారు చేసిన ఈ-సైకిల్స్‌పై అధ్యయనం చేశానన్నాడు. అలాగే పలువురు విద్యార్థులు ఆవిష్కరించిన వాహనాల తయారీ, వాటి ఖర్చు గురించి పరిశీలించి... అనంతరం యూట్యూబ్‌లో వివిధ రకాల సైకిల్స్ తయారీ గురించి చూశానన్నాడు. సైకిల్‌కు అవసరమయ్యే పరికరాలను రాజస్థాన్, ఢిల్లీ నుంచి దాచుకున్న డబ్బుతో ఆన్‌లైన్ ద్వారా తెప్పించుకున్నానని, వీటికి కొంతమంది స్నేహితుల సాయం తీసుకున్నానన్నాడు.
అభిమాన హీరో... అభినందించిన వేళ...
‘ఇష్టమైన హీరో, ప్రజలు మెచ్చే నాయకుడు తాను తయారుచేసిన వాహనాన్ని డ్రైవ్ చెయ్యటం మరిచిపోలేని అనుభూతికలిగింద’ని సిద్దూ ఆనందం వ్యక్తం చేశాడు. సైకిల్ తయారుచేసిన విధానం గురించి డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారని, భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేసి సమాజానికి ఉపయోగపడాలంటూ తనకు చెప్పారని అన్నాడు. ‘తన ప్రయోగాన్ని మెచ్చుకుని, అప్పటికప్పుడు లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వటం ఆనందాన్నిచ్చింద’న్నాడు. ఈ ప్రోత్సాహంతో సిద్దూ ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెలబ్రిటీగా మారాడు.
- బి.శ్రీనివాసరావు, విజయనగరం
కష్టం చేసి చదివిస్తున్నాం
‘‘సిద్దూ మొదటి నుంచి తెలివిగల అబ్బాయి. మేము నిరుపేదలం కావడంతో 15 ఏళ్ల క్రితమే ఉపాధి కోసం వలస వెళ్లాం. తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌లోని ఓ స్పిన్నింగ్ మిల్లులో రోజువారీ కూలీలుగా పని చేసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నాం. కొడుకు సిద్దూ, కూతురు దీపిక ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. ఇటీవల మేము ఊరువచ్చినప్పుడు తాను రూపొందించ బోయే బ్యాటరీ సైకిల్ గురించి చెప్పాడు. సిద్దూపై నమ్మకంతో పరికరాల కోసం డబ్బు అందజేశాం. వాటితో తనే బ్యాటరీ సైకిల్ తయారు చేసుకోవటం గొప్ప విషయం. ఇలా అందరి ప్రశంసలు పొందటం ఆనందంగా ఉంది.’’
- వెంకటలక్ష్మి, సింహాచలం
(సిద్దూ తల్లిదండ్రులు)