Share News

Artificial Intelligence: ఏఐతో నేరగాళ్లకు చెక్‌

ABN , Publish Date - Jun 29 , 2025 | 05:10 AM

కృత్రిమ మేధ ఏఐ ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తోంది. ఆ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఏపీ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు.

Artificial Intelligence: ఏఐతో నేరగాళ్లకు చెక్‌

  • ఏపీ పోలీసుల వినూత్న ప్రయత్నం.. సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో హ్యాకథాన్‌

  • యూజ్‌ కేసులతో మేధో మథనం.. సులువుగా వినియోగించేలా సాఫ్ట్‌వేర్‌

  • వాయిస్‌ కమాండ్లతోనే డేటా ప్రత్యక్షం.. దర్యాప్తు పుంజుకుంటుందనే విశ్వాసం

గుంటూరు, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తోంది. ఆ అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఏపీ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పోలీసు శాఖలో ప్రతీ ఒక్కరూ వినియోగించేలా ఏఐతో రూపొందించే ఆధునిక పరిజ్ఞానం రూపుదిద్దుకుంటోంది. కంప్యూటర్‌ కమాండ్లు తెలియకపోయినా కేవలం వాయిస్‌ కమాండ్స్‌ ఇస్తే సమగ్ర సమాచారం రియల్‌టైంలో ఇచ్చేలా ఐటీ రంగ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరులోని ఆర్‌వీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఫర్‌ ఏపీ పోలీసు పేరుతో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి హ్యాకథాన్‌లో రెండో రోజు శనివారం పోలీసు ఉన్నతాధికారులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు టెక్నికల్‌ సెషన్స్‌లో నిమగ్నమయ్యారు. బృందాలుగా విడిపోయి తమకు ఇచ్చిన యూజ్‌ కేస్‌ (డేటా సేకరణలో పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు)ల్లో సవాళ్లను పరిష్కరించేందుకు మెదడుకు పనిచెప్పారు. పోలీసు శాఖ గుర్తించిన ఎనిమిది యూజ్‌ కేస్‌ లకు సంబంధించి సులభమైన సాఫ్ట్‌వేర్‌లను ఆదివారం మధ్యాహ్నం కల్లా ఇంజనీర్లు అందిస్తారని పోలీసు ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. ఈ హ్యాకథాన్‌ సందర్భంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు, సాఫ్ట్‌వేర్‌ నిపుణులు, విద్యార్థులను ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. హ్యాకథాన్‌ గురించి వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే...


ఏఐ పవర్డ్‌ కాల్‌డేటా విశ్లేషిస్తున్నాం

మా స్వస్థలం నెల్లూరు జిల్లా. టీ-హబ్‌లో రాక్సాన్‌ అనే స్టార్ట్‌పను ఏర్పాటు ఏర్పాటు చేశాను. మా టీంకు ఏఐ పవర్డ్‌ సీడీఆర్‌/ఐపీడీఆర్‌కు చెందిన పెద్ద డేటాను విశ్లేషించే సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనకు అవకాశం ఇచ్చారు. ఎక్కడైనా నేరం జరిగితే టవర్‌ డేటాని వినియోగించి డేటాని సేకరిస్తారు. అలానే కాల్‌ రికార్డ్స్‌, ఇంటర్నెట్‌ వినియోగంపై సమాచారం సేకరించి అనుమానితులను గుర్తిస్తారు. అయితే ఇప్పుడు ఈ రికార్డ్స్‌ ఎక్కువైపోయాయి. దీంతో వాటిని విశ్లేషించడం కోసం చాలా సమయం పడుతోంది. దీనిని అధిగమించేందుకు ఏఐ సాఫ్ట్‌వేర్‌ని రూపొందిస్తున్నాం. దీంతో నిమిషాల్లోనే వందల కాల్‌ రికార్డ్స్‌, ఇంటర్నెట్‌ రికార్డులను విశ్లేషించే సదుపాయం పోలీసులకు అందుబాటులోకి వస్తుంది.

- దినేష్‌, రాక్సాన్‌ స్టార్టప్‌ సీఈవో, టీ హబ్‌


వార్తల విశ్లేషణకు ఉపయోగపడేలా..

పోలీసులకు సంబంధించిన వార్తలు తేదీల వారీగా ఆటోమేటిక్‌గా ఇచ్చేందుకు మినిమల్‌ వయబుల్‌ ప్రొడక్టు(ఎంవీపీ)ని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యం. రోజూ పోలీసు అధికారులు వార్తలు చదవాలి. అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయి. అయితే పని ఒత్తిడిలో ఆ పని చేయలేకపోతున్నారు. ఏఐని వినియోగించి అంశాల వారీగా వార్తలను క్రోడీకరిస్తే పోలీసు అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. డయల్‌ 112, క్రైం హాట్‌స్పాట్స్‌లో శాంతిభద్రతలపై వేగంగా హెచ్చరికలు పంపే అంశంపైనా సాఫ్ట్‌వేర్‌ని రూపొందించాలని కోరాం. ఇది వస్తే క్రైం జరిగిన కచ్చితమైన ప్రదేశానికి పోలీసులు వేగంగా చేరుకొనే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో హీట్‌ మ్యాప్‌లు కూడా జనరేట్‌ చేసి ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయనేది తెలుసుకోవచ్చు. అలానే డైనమిక్‌ బీట్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు చేయొచ్చు.

- మల్లిక గార్గ్‌, ఏపీఎ్‌సపీ 5వ బెటాలియన్‌ కమాండెంట్‌, విజయనగరం


వార్తల అంశాలను విభజిస్తున్నాం

మా బృందం యూజ్‌ కేస్‌-8పై పని చేస్తోంది. ఆంగ్ల వార్త పత్రికల్లోని కథనాలను సరళమైన తెలుగు భాషలోకి అనువదించి స్నేహపూర్వక డ్యాష్‌బోర్డు ద్వారా/పీడీఎఫ్‌ నివేదికగా అందిస్తాం. సీనియర్‌ పోలీసు అధికారులు చెప్పిన విధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన నిర్దిష్టమైన వార్తల కంటెంట్‌పైనా దృష్టి పెడుతున్నాం. వార్తలను ఫిల్టర్‌ చేయడానికి, సంకలనం చేయడానికి, క్రాస్‌-రిఫరెన్స్‌కు ఏఐని వినియోగిస్తున్నాం. వివిధ పత్రికలు ఒకే సంఘటనపై ఎలా నివేదిస్తాయనే దానిపై విశ్లేషణ చేప్పేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తున్నాం.

- కె.వెంకట ఈశ్వర్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థి, అపోలో యూనివర్సిటీ, చిత్తూరు


వాట్సాప్‌, గ్రూపు చాట్‌ డేటాలను విశ్లేస్తున్నాం

విస్తృతమైన గ్రూపు, వాట్సాప్‌ చాట్‌ల డేటాలను విశ్లేషించి సరళీకృతం చేయడం ద్వారా పోలీసు సిబ్బందికి సహకరించేందుకు యూజ్‌ కేస్‌-7లో సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది పెద్ద మొత్తంలో మెసేజ్‌లను టాపిక్‌ ఆధారిత అంశాలుగా కుదిస్తుంది. దీని వలన చాట్‌లలోని ప్రధాన అంశాలను ఇన్వెస్టిగేషన్‌ అధికారులు గుర్తించడం సులభం అవుతుంది. సమాచార ప్రాసెసింగ్‌పై వెచ్చిస్తున్న సమయాన్ని తగ్గించి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. ఇందుకోసం ఎల్‌ఎల్‌ఎం మాడ్యూల్స్‌, పైథాన్‌ వంటివి వినియోగిస్తున్నాం.

- సమన్విత, ఇంజనీరింగ్‌ విద్యార్థిని, వీవీఐటీ, గుంటూరు


ప్రతి ఒక్కరూ డేటా విశ్లేషించగలరు

నేరగాళ్ల కదలికలు కనిపెట్టడానికి వాట్సాప్‌, గూగుల్‌ టేకౌట్‌ వినియోగించాల్సి వస్తోంది. కాల్‌ డిటెక్షన్‌ రికార్డు (సీడీఆర్‌), ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ రికార్డు (ఐపీఆర్‌), బ్యాంకు స్టేట్‌మెంట్లు చూడాల్సి వస్తోంది. సిబ్బందిలో ప్రతీ ఒక్కరూ ఇది చేయలేరు. ఏఐ సహాయంతో డేటా సేకరించి నిందితులను గుర్తించేందుకే ఈ ప్రయత్నం. ఈ హ్యాకథాన్‌లో ఆరు బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పుడు తయారు చేసే ఏఐ పవర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా సీడీఆర్‌, ఐపీఆర్‌లను ఎవరైనా సులువుగా వినియోగించవచ్చు. నేరస్థులను పట్టుకోవచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ సిస్టమ్‌ని పోలీసు శాఖకు అందుబాటులోకి తీసుకొస్తాం.

- కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌, ఏలూరు జిల్లా ఎస్‌పీ వాయిస్‌ బేస్డ్‌


క్వరీయింగ్‌పై వర్కు చేస్తున్నాం

నేను విప్రో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. ఈ హ్యాకథాన్‌లో యూజ్‌ కేస్‌-2 ఏఐ పవర్డ్‌ వాయిస్‌ బేస్డ్‌ నేచురల్‌ లాంగ్వేజ్‌ క్వరీయింగ్‌, రిపోర్టు జనరేషన్‌ ఫ్రం క్రైం అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్కు సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎ్‌స) డేటా అంశంపై నలుగురు సభ్యుల బృందంతో కలిసి పనిచేస్తున్నాను. దీనిని ఓ సవాలుగా స్వీకరించాం. సీసీటీఎన్‌ఎ్‌స డేటాకు ఇంగ్లీషు/తెలుగులో ఒక కమాండ్‌ పంపితే రిపోర్టు జనరేట్‌ అయ్యేలా ఏఐ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రతి పోలీసుస్టేషన్‌లో డేటా ఉంటుంది. కానీ ఆ డేటా ఓ సిబ్బంది పరిధిలోనే ఉంటుంది. అతనిపైనే అందరూ ఆధారపడాలి. ఇప్పుడు మేము తయారు చేసే సాఫ్ట్‌వేర్‌తో వాయిస్‌ కమాండ్‌ ద్వారా కోరిన సమాచారం సీసీటీఎన్‌ఎ్‌స నుంచి వస్తుంది. దీని వలన పనిలో ఎంతో వేగం పెరుగుతుంది.

- పవన్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, విప్రో

Updated Date - Jun 29 , 2025 | 05:11 AM