AP Police Association Response: మమ్మల్ని మాఫియా గ్యాంగులతో పోలుస్తారా
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:59 AM
పోలీసులను.. మాఫియా గ్యాంగులు, నేరస్థులతో పోలుస్తూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్..

డీఐజీని డాన్ అంటారా.. డీజీపీని టార్గెట్ చేస్తారా?
జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మండిపాటు
చట్టానికి ఎవరూ అతీతులు కాదు
మీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడూ పనిచేస్తున్నారు
మీ హయాంలోనూ వీఆర్‌కు పంపారు
ఎంత మంది పోలీసు అధికారులను పక్కనపెట్టారో గుర్తుతెచ్చుకోండి
నిబంధనల మేరకు మీకు భద్రత కల్పిస్తున్నాం
జగన్‌కు సంఘం అధ్యక్షుడు జనకుల స్పష్టీకరణ
విజయవాడ (గాంధీనగర్), జూలై 17 (ఆంధ్రజ్యోతి): పోలీసులను.. మాఫియా గ్యాంగులు, నేరస్థులతో పోలుస్తూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా పేర్కొంది. గురువారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు మాట్లాడారు. పోలీసులు ఏ రాజకీయ పార్టీలకూ అనుకూలంగా వ్యవహరించరన్నారు. పారదర్శకంగా చట్టాలను అమలు చేస్తున్న తమను అవమానకరంగా, అవహేళనగా మాట్లాడి.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, మనోభావాలను కించపరచడం జగన్‌కు తగదన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడూ విధులు నిర్వహిస్తున్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ‘వైసీపీ నేతలను అరెస్టు చేసేందుకే పోలీసు వ్యవస్థ ఉందని, తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పనిచేసిన వ్యక్తి మాట్లాడడం సరికాదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన తెలుసుకోవాలి. పోలీసులను వీఆర్‌లో పెట్టడం గత ప్రభుత్వంలో కూడా జరిగింది. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవడం సహజం. మీ ప్రభుత్వం ఎంతమంది పోలీసు అధికారులను పక్కన పెట్టిందో గుర్తు చేసుకోండి. పోలీసులు.. ఎమ్మెల్యేలు, మంత్రులకు డబ్బు లు వసూలు చేసి ఇస్తున్నారని ఆరోపించడం దుర్మార్గం.
డీఐజీ స్థాయి అధికారిని మాఫియా డాన్ అంటానా? పోలీసు వ్యవస్థను నడిపే డీజీపీని టార్గెట్ చేయడమేంటి? డీజీపీ సారథ్యంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. పోలీసుల వల్ల ఇబ్బందులు కలిగితే న్యాయస్థానాలను ఆశ్రయించండి’ అని హితవు పలికారు. నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి ఆపాదించడం సరైంది కాదన్నారు. పలు సినిమాల్లో పోలీసులను విలన్లుగా చూపిస్తున్నారని, దీనిపై న్యాయస్థానాల్లో కేసులు వేయాలని భావిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరతయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్