AP News: పల్లెలకు పైసలొచ్చాయ్... ఇక పండగే పండగ..
ABN , Publish Date - Sep 04 , 2025 | 09:38 AM
గ్రామ పంచాయతీలకు 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను జనవరిలోనే కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా తన ఖాతాలోనే ఉంచుకుంది.
- పంచాయతీల ఖాతాలకు రూ 70.04 కోట్లు జమ
- ఎట్టకేలకు నిధులు విడుదల చేసిన ఆర్థిక సంఘం
- నిధుల విడుదలతో పంచాయతీల పాలక వర్గాల హర్షం
పంచాయతీలకు ఎట్టకేలకు నిధుల మోక్షం లభించింది. ఎనిమిది నెలల అనంతరం పంచాయతీల వారీగా వాటి బ్యాంకు ఖాతాలకు 15వ ఆర్థిక సంఘం రూ. 70.04 కోట్ల నిధులు జమ చేసే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. రెండు మూడు రోజుల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల(Palnadu, Guntur, Bapatla) జిల్లా ల్లోని పంచాయ తీలకు నిధులు జమ అవు తాయని పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు తెలిపారు.
(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీలకు 2024-25 సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులను జనవరిలోనే కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఈ నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా తన ఖాతాలోనే ఉంచుకుంది. పంచాయతీల సర్పంచ్‌లు ఉద్యమ బాట పట్టిన నేపథ్యంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీలకు అన్‌టైడ్ గ్రాంటు కింద రూ 28.21 కోట్లు, టైడ్ గ్రాంటు కింద 41.82 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని జనాభా ప్రాతిపదికన పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మొదటి విడతలో కొన్ని పంచాయతీలకు ఉన్న బకాయిలను కూడా ఆర్థిక సంఘం విడుదల చేసింది.
నిధులు విడుదలతో పంచాయతీలకు ఊరట
కనీసం బ్లీచింగ్ కూడా కొనలేని స్ధితిలో పంచాయతీలు కొట్టిమిట్టాడుతున్న సమయంలో ఆర్థిక సంఘం నిధుల విడుదల ఊరట నిచ్చింది. మొత్తం నిధుల్లో 60 శాతం టైడ్ నిధులుగా, 40 శాతం అన్‌టైడ్ నిధులుగా విడుదలయ్యాయి. టైడ్ నిధులను ఓడీఎఫ్ నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, తాగు నీటి సరఫరా, రహదారుల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నిధులను నిబంధనల మేరకు ఖర్చు చేయాలి. ఇందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఆర్థిక సంఘం నిధులు విడుదలైన ప్రతిసారీ పంచాయతీల విద్యుత్ బకాయిలకు కొంత మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది.

అదే తరహాలో ఇప్పుడు అన్‌టైడ్ గ్రాంటుగా విడుదల చేసిన రూ.28.21 కోట్లలో పది శాతం విద్యుత్ బకాయిలకు కచ్చితంగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో పది శాతం నిధులను ఎల్‌ఈడీ వీధి దీపాల నిర్వహణకు, 20 శాతం నిధులను కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాలకు, కంప్యూటర్ల కోనుగోలు, స్టేషనరీ ఇతర సామగ్రి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే పాఠశాల భవనా మరమ్మత్తులు, తాగునీటి వసతి, ఆట స్థలాల అభివృద్ధి వంటి పనులకు ఈ నిధులను ఖర్చు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
నిధులు విడుదలతో పంచాయతీల పాలక వర్గాలు హర్షం
ఎనిమిది నెలల తర్వాత నిధులు విడుదల కావడంతో పంచాయతీల పాలక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లో సమస్య లు తీరే అవకాశం ఏర్పడిందని పేర్కొంటున్నాయి. ఈ నిధులతో పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని చెబు తున్నాయి. కాగా, పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారుడు, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజ నేయులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పంచాయ తీలను బలోపేతం చేస్తోందన్నారు. నిధులు విడుదల చేయడం పట్ల అయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రికార్డు స్థాయికి బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిన్ను.. నీ కుటుంబాన్ని చంపేస్తాం
Read Latest Telangana News and National News