Telugu Theatre Awards: సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తాం
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:26 AM
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి దుర్గేశ్ తెలిపారు.తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా 113 మందికి ‘కందుకూరి’ పురస్కారాలు ప్రదానం చేశారు.

సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్
నాటక రంగంలో 113 మందికి ‘కందుకూరి’ పురస్కారాలు
విజయవాడ కల్చరల్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కళలు, సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరిస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. కందుకూరి 177వ జయంతి సందర్భంగా ఏపీ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ‘తెలుగు నాటకరంగ దినోత్సవం-2025’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గేశ్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నాటకానికి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి, నాటకానికి సామాజిక ప్రయోజనం ఉండాలని విశ్వసించిన రచయిత వీరేశలింగం పంతులు అని కొనియాడారు. తెలుగులో మొట్టమొదటి నాటకం రాసిన కందుకూరిని నాటకరంగ ఆద్యుడుగా అభివర్ణించారు. నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 113 మందికి మంత్రి అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయిలో ముగ్గురికి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు, జిల్లాస్థాయిలో 110 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలను అందజేశారు.