AP High Court: పామర్రు పోలీసుల కేసు.. పేర్ని నాని పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
ABN , Publish Date - Jul 17 , 2025 | 09:49 PM
పామర్రు పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పేర్ని నాని దాఖలు చేసిన పిటిషన్ విషయంలో నిరాశ ఎదురైంది. ఎందుకంటే తాజాగా ఆ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతోపాటు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న పేర్ని నాని (Perni Nani)కి తాజాగా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పామర్రు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టు(AP High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని, నాని తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే సమయంలో హైకోర్టు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ.. ఈ కేసు విచారణను జులై 22కి వాయిదా వేసింది.
చేసిన ప్రయత్నాలు
ఈ వాయిదాతో పేర్ని నానికి తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, కేసు రద్దు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. హైకోర్టు తదుపరి విచారణలో ఏ నిర్ణయం తీసుకుంటుంది? పేర్ని నానికి ఈ కేసు నుంచి ఊరట లభిస్తుందా లేక మరిన్ని చిక్కులు ఎదురవుతాయా? అనేది జులై 22న తేలనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ కేసు గురించి చర్చలు ఊపందుకున్నాయి.
ఏం జరిగింది?
అసలు ఏం జరిగిందంటే.. జూలై 8న కృష్ణా జిల్లా ఆరేపల్లిలో నిర్వహించిన వైసీపీ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సభలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రప్పా... రప్పా అంటూ మాట్లాడిన ఆయన మాటలు శాంతి భద్రతలకు ప్రమాదకరంగా ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది.
ఈ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకుడు చాట్ల రమేష్‌తో పాటు మరికొంతమంది నేతలు కలిసి పామర్రు సీఐ సుభాకర్‌కు ఫిర్యాదు చేశారు. పేర్ని నానితో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసు విషయంలో న్యాయ రక్షణ కోసం పేర్ని నాని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం విజ్ఞప్తి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో ఏపీకి 5 పురస్కారాలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి