DSC Notification: మెగా డీఎస్సీ వచ్చేస్తుంది
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:57 AM
రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు రాత పరీక్షలు జరగనున్నాయి

మెగా డీఎస్సీ వచ్చేసింది
16,347 పోస్టులకు షెడ్యూలు విడుదల
3 నెలల్లో ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్
మెగా డీఎస్సీ ఫైలుపైనే నాడు బాబు తొలి సంతకం
టెట్, ఎస్సీ వర్గీకరణ కోసం రెండుసార్లు వాయిదా
జూన్ 6 నుంచి జూలై 6 వరకు నియామక పరీక్షలు
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి షెడ్యూల్ విడుదల చేసింది. టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. 3 నెలల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేసేలా షెడ్యూలు రూపొందించింది. సీఎం చంద్రబాబు పుట్టినరోజు నాడే ఈ మేరకు ప్రకటన వెలువడనుండటం విశేషం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 13,192 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌తో పాటు 52 ప్రిన్సిపాల్, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టులను రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత 45 రోజుల్లో రాత పరీక్షలు ప్రారంభమవుతాయి. జూన్ 6న ప్రారంభమయ్యే పరీక్షలు జూలై 6 వరకు కొనసాగుతాయి. పరీక్షలు ముగిసిన వెంటనే ఎప్పటికప్పుడు ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించారు. కానీ టెట్ నిర్వహణ కోసం కొంతకాలం వాయిదా వేశారు. ఈలోగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు రావడంతో రెండోసారి వాయిదా పడింది. తాజాగా వర్గీకరణ ప్రక్రియ పూర్తికావడంతో మెగా డీఎస్సీ షెడ్యూల్ జారీ చేశారు.
ఎవరి హయాంలో ఎన్ని డీఎస్సీలంటే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తంగా తెలుగుదేశం ప్రభుత్వమే అత్యధిక డీఎస్సీలు ప్రకటించింది. టీడీపీ ప్రభుత్వాల్లోనే ఎక్కువమంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఎన్టీఆర్ హయాంలో 1984, 1986, 1989ల్లో మూడు డీఎస్సీలు ఇచ్చారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో 1994లో ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో 1996, 1998, 2000, 2001, 2002, 2003 సంవత్సరాల్లో డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చారు. విభజిత రాష్ట్రంలో 2014, 2018ల్లో రెండు డీఎస్సీలు ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో 2006, 2008ల్లో రెండు నోటిఫికేషన్లు, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో 2012లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. జగన్ హయాంలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు హడావిడిగా 6,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా, అది మధ్యలోనే ఆగిపోయింది. 2018లో రాష్ట్రంలో చివరిగా ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 7,729 పోస్టులు భర్తీ చేశారు.