Governor Abdul Nazir Speech: సవాళ్లను స్వీకరించాలి
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:05 AM
విద్యార్థులు సవాళ్లను స్వీకరించడం అలవర్చుకోవాలని, ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని ఉన్నతం..

ఆసక్తి ఉన్న రంగాల్లో ఎదగాలి
వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏపీ టాప్: గవర్నర్ అబ్దుల్ నజీర్
ఉంగుటూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు సవాళ్లను స్వీకరించడం అలవర్చుకోవాలని, ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని ఉన్నతం గా ఎదగాలని రాష్ట్ర గవర్నర్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవాన్ని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గవర్నర్ నజీర్ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించ గా...పంజాబ్ ఎన్‌ఆర్‌ఐ కమిషన్ సభ్యుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.వేణుప్రసాద్ స్నాతకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా 46 మందికి డాక్టరేట్‌లు, 196 మందికి పోస్ట్‌గ్రాడ్యుయేట్, 1420 మంది గ్రాడ్యుయేట్లకు బంగారు, వెండి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందించారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏపీ టాప్
గవర్నర్ నజీర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8.8 శాతం వృద్ధి రేటు సాధించి 2024-25లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. జనాభా అవసరాలను తీర్చడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ జనాభాలో దాదాపు 46.1 శాతం మందికి వ్యవసాయ రంగం జీవనోపాధిని కల్పిస్తోందన్నారు. తృణధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్థిని సాధించిన భారతదేశం పోషకాహారలోప సమస్యను నివారించడంలో కీలకమైన పప్పు ధాన్యాల ఉత్పత్తిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిరంతర కృషి ఫలితంగా 2023-24లో 25 మేలైన పంట రకాలు వచ్చాయన్నారు. మార్కెట్ డిమాండ్ మేరకు సరైన పంటలను ఎంపిక చేసి సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ధరలను పొందాలని సూచించారు.
ఐఐటీలకు దీటుగా..
పంజాబ్ రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ కమిషన్ సభ్యుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎ.వేణుప్రసాద్ మాట్లాడుతూ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థిగా తాను అభ్యసించిన విద్య ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి, అత్యున్నత సామాజిక సేవకు ఎంతగానో దోహదపడిందన్నారు. విశ్వవిద్యాలయం ఉన్నతమైన ఐఐటీలతో పోటీపడి, వాటికి ధీటుగా సత్ఫలితాలు సాధిస్తోందన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రతిభను చాటాలన్నారు.వ్యవసాయశాఖ కమిషనర్ ఎస్.దిల్లీరావు, ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ, ఉపకులపతి ఆర్.శారద జయలక్ష్మీదేవి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News