Share News

YS Jagan: జగన్‌కు మానవత్వం లేదు

ABN , Publish Date - Jun 24 , 2025 | 06:55 AM

‘వైఎస్‌ జగన్‌కు మానవత్వం లేదు. ఆయన రాజకీయం ముసుగులో హింసను ప్రేరేపిస్తున్న నేరస్థుడు’ అని హోం మంత్రి అనిత విమర్శించారు.

 YS Jagan: జగన్‌కు మానవత్వం లేదు

  • ఉన్మాదుల్ని ప్రోత్సహిస్తున్న నేరస్థుడు: అనిత

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ జగన్‌కు మానవత్వం లేదు. ఆయన రాజకీయం ముసుగులో హింసను ప్రేరేపిస్తున్న నేరస్థుడు’ అని హోం మంత్రి అనిత విమర్శించారు. ‘‘సమాజంలో ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి అది మరింత ఉండాలి. కానీ మాజీ సీఎం జగన్‌, వైసీపీ నేతలు ఏ మాత్రం బాధ్యత లేకుండా రాజకీయాలను దిగజార్చుతున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం సృష్టించడానికి వైసీపీ కార్యకర్తల్ని ఉన్మాదుల్లా ప్రోత్సహిస్తున్నారు. తన కారు టైరు కింద సొంత పార్టీ కార్యకర్త పడి నలిగిపోతుంటే... కారు ఆపకుండా ముళ్లపొదల్లోకి ఈడ్చి పడేయించిన జగన్‌ను చూశాక... జాలి, దయ లేని మనుషులు కూడా సమాజంలో ఉంటారని అర్థమైంది.


ఆరోజు జగన్‌ కారు ఆపి, అతన్ని వెంటనే అంబులెన్స్‌లో పంపి ఉంటే... దళిత కార్యకర్త సింగయ్య బతికేవాడు. ‘సింగయ్య మృతితో నాకేం సంబంధం’ అంటూ తప్పును సమర్థించుకుంటూ జగన్‌ తన విలువను దిగజార్చుకున్నారు’’ అని అనిత అన్నారు. కాగా, రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు జగన్‌ తన మాఫియా గ్యాంగ్‌తో కలసి కుట్ర పన్నుతున్నాడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తునిలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఏర్పడిందన్నారు. ఇది నచ్చని జగన్‌ రెడ్డి పరామర్శల పేరుతో రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు కుట్ర పన్నుతున్నాడన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 06:55 AM