Share News

Visakhapatnam:దేశాభివృద్ధిలో ఏయూ పాత్ర కీలకం

ABN , Publish Date - Apr 27 , 2025 | 02:44 AM

దేశాభివృద్ధిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని శతాబ్ది ఉత్సవాల్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ మధుమూర్తి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులు రూపకల్పన చేయాలని సూచించారు.

Visakhapatnam:దేశాభివృద్ధిలో ఏయూ పాత్ర కీలకం

  • ఉన్నత విద్యలో వేగంగా మార్పులొస్తున్నాయి

  • దానికి అనుగుణంగా కోర్సులు డిజైన్‌ చేయాలి

  • ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.మధుమూర్తి

  • వర్సిటీ అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధం

  • పాలక్కాడ్‌ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శేషాద్రి శేఖర్‌

  • ఏయూకి, మాకు మధ్య పోటీ లేదు: ఎంపీ శ్రీభరత్‌

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు ప్రారంభం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.మధుమూర్తి అన్నారు. విశాఖ బీచ్‌రోడ్డులోని కన్వెన్షన్‌ హాల్‌లో ఏయూ శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి మధుమూర్తి మాట్లాడుతూ ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విభిన్న రంగాలకు చెందినవారిని ఏయూ దేశానికి అందించిందని గుర్తుచేశారు. తన కుటుంబంలోని మూడు తరాలు ఇక్కడే చదువుకోవడం, అదే వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావడం గర్వంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా పాఠ్య ప్రణాళిక మార్చడంతో పాటు నూతన కోర్సులు డిజైన్‌ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యాసంస్థల్లో డిజిటలైజేషన్‌, స్కిల్లింగ్‌, టెక్నాలజీని తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతోందని వివరించారు. గౌరవ అతిథి పాలక్కాడ్‌ ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శేషాద్రి శేఖర్‌ మాట్లాడుతూ ఏయూ పూర్వ విద్యార్థినైన తాను వందేళ్ల వేడుకల ప్రారంభోత్సవానికి రావడంపై సంతోషం వ్యక్తంచేశారు.


వర్సిటీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ ఏయూ పట్ల అందరికీ కేర్‌, ఎమోషన్‌ ఉందని, వర్సిటీ పూర్వ వైభవం సాధించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఏయూకు, తమకు (గీతం వర్సిటీ) మధ్య పోటీ లేదని స్పష్టంచేశారు. ఏయూ చచ్చిపోతే గీతం బాగుంటుందని తాము భావిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని, అసలు ఏయూకు, గీతంకు మధ్య పోటీలేనప్పుడు ఇటువంటి పోలికలు ఎందుకని ఎంపీ ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏయూ వీసీ జీపీ రాజశేఖర్‌, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ ధనుంజయరావు, రెక్టార్‌ కిశోర్‌బాబు, వివిధ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఫ్యాకల్టీ సభ్యులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ శతాబ్ది వేడుకలకు సంబంధించిన విజన్‌ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. అంతకుముందు ఉదయం బీచ్‌ రోడ్డులో వాకథాన్‌ నిర్వహించారు.

Updated Date - Apr 27 , 2025 | 02:45 AM