Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ
ABN , Publish Date - May 18 , 2025 | 05:17 AM
ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవంలో విద్యార్థులు ఏఐ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

వికసిత్ భారత్‌ను అధిగమించేలా స్వర్ణాంధ్ర-2047
ఏఐకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి
అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్
అనంతపురం, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా, పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ వేదిక కానుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అనంతపురం జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సుదర్శనరావు అధ్యక్షతన, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఐఐటీ కాన్పూర్ విశ్రాంత ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్ హాజరయ్యారు. ముందుగా హైదరాబాద్ లారస్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ సత్యనారాయణ చావాకు గవర్నర్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆ తరువాత 41 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 40,109 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. ‘ప్రపంచం మీ ఆలోచనలు, మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. వినయంతో ముందుకు సాగి వర్సిటీ అత్యున్నత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి’ అని విద్యార్థులకు గవర్నర్ సూచించారు. జాతీయ క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీ, క్వాంటం కంప్యూటింగ్ హబ్‌ను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వ స్వర్ణాం ధ్ర-2047 విజన్ ఉందని అన్నారు. 2047 నాటికి ఆర్థికశ్రేయస్సు, సాంకేతిక పురోగతి, సామాజిక సమానత్వం, పర్యావరణ స్థిరత్వాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్ రూపొందించిందని తెలిపారు. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొని, అవకాశాలను అందుకునేలా యువతను సిద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణలకు ప్రాధాన్యం ఇస్తోందని గవర్నర్ తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ క్రిష్ట య్య, వర్సిటీ అధ్యాపకులు సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి హరి జవహర్‌లాల్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి, కలెక్టర్ వినోద్‌కుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మె ల్యే పల్లె సింధూరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.