Share News

E Check Drive: నేడు ఇ-చెక్‌ థీమ్‌తో స్వచ్ఛాంధ్ర

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:15 AM

ఈనెల 19న 'ఇ-చెక్‌' థీమ్‌తో స్వచ్ఛాంధ్ర దినోత్సవం నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ పై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చారు

E Check Drive: నేడు ఇ-చెక్‌ థీమ్‌తో స్వచ్ఛాంధ్ర

  • ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపట్టండి

  • సురక్షిత పద్ధతుల్లో రీసైక్లింగ్‌పై దృష్టి

  • ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి

  • ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు

  • కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

  • మున్సిపల్‌ కమిషనర్లకు మంత్రి నారాయణ నిర్దేశం

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర-2047’ సంకల్పంలో భాగంగా ప్రభుత్వం ప్రతినెలా స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 19వ తేదీన (శనివారం) ‘ఇ-చెక్‌’ థీమ్‌తో కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఇ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్‌ చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు శుక్రవారం ఎక్స్‌లో స్పందించారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్‌ ఎకానమీ సాధ్యమవుతుందని, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు, కార్పొరేట్‌ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ ఇ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక గ్రూపు సభ్యులను గుర్తించి, వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌ అనేది ఇ-వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలని పేర్కొన్నారు. మరోవైపు శనివారం జరిగే స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా మూడో శనివారం ఈ కార్యక్రమం జరుగుతోందని, ఈ నెల 19న ‘ఇ-చెక్‌’ అనే థీమ్‌తో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.


ఇ-వ్యర్థాల సేకరణ కేంద్రాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్లు

ఇ-చెక్‌ అంటే అన్ని మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోని ఎలకా్ట్రనిక్‌ వ్యర్థాలను సేకరించి రీయూజ్‌ చేయడమని మంత్రి వివరించారు. ఇందుకోసం మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో ఉన్న ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌) సెంటర్లను ఇ-వ్యర్థాల సేకరణ కేంద్రాలుగా మార్చనున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ కేంద్రాల్లో ఇ-వ్యర్థాలు సేకరించేందుకు స్వయం సహాయక సం ఘాల మహిళలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఇళ్లు, దుకాణాల్లో ఉన్న పాడైపోయిన మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలను ఇ-వ్యర్థాల సేకరణ కేంద్రాల్లో ఇవ్వడం ద్వారా తగిన నగదు కూడా చెల్లిస్తారన్నారు. ఇదే సమయంలో మహిళలకు కూడా ఉపాధి కలుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మొత్తం 222 ఇ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి చెప్పారు. శనివారం నుంచి జరిగే ఇ-వేస్ట్‌ కలెక్షన్‌ కోసం మున్సిపల్‌ కమిషనర్లు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని విజయవంతం చేయాలని సూచించారు. కాగా, మంత్రి శనివారం నెల్లూరులో స్వచ్ఛాంధ్ర దివస్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

Updated Date - Apr 19 , 2025 | 05:15 AM