జిల్లాలో రహదారులను అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:44 AM
జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ హామీ ఇచ్చారు. పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస అతిథి గృహంలో జిల్లాలో రహదారుల ప్రగతిపై రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల ఏర్పాటుపై ఆరాతీశారు. ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, ...
మంత్రులు, ఎమ్మెల్యేలకు కేంద్రమంత్రి గడ్కరీ హామీ
పుట్టపర్తి టౌన, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ హామీ ఇచ్చారు. పుట్టపర్తి పర్యటనకు వచ్చిన ఆయన గురువారం సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీనివాస అతిథి గృహంలో జిల్లాలో రహదారుల ప్రగతిపై రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన రెడ్డి, కందుల దుర్గేష్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల ఏర్పాటుపై ఆరాతీశారు. ఎమ్మెల్యేలు, పరిటాల సునీత, ఎంఎస్ రాజు, పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ నియోజకవర్గాల్లో రహదారుల పరిస్థితిపై కేంద్రమంత్రితోపాటు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెనుకొండ వద్ద జాతీయ రహదారి-44 నుంచి కొత్తచెరువు, పుట్టపర్తి, నల్లమాడ, ఓబుళదేవరచెరువు, మహమ్మదాబాద్ క్రాస్, సీజీ ప్రాజెక్టు, కొక్కంటి క్రాస్ మీదుగా చెన్నై జాతీయ రహదారితో కలపాలని కేంద్రమంత్రిని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కోరారు. పుట్టపర్తి నియోజకవర్గంలో నూతన ఆర్‌అండ్‌బీ రోడ్లు, దెబ్బతిన్న బీటీ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి బీసీ జనార్దనరెడ్డిని కోరారు. నియోజకవర్గంలో రహదారులులేని గ్రామాల వివరాలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. అనంతరం పుట్టపర్తి నుంచి బెంగళూరుకు బయలుదేరిన కేంద్రమంత్రి నితిన గడ్కరీ, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, సామకోటి ఆదినారాయణ, టీడీపీ నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, గంగాధర నాయుడు, సురేష్ చౌదరి, పీసీ గంగన్న, బీజేపీ నాయకులు లాయర్ హరికృష్ణ, జ్యోతి ప్రసాద్, సునీల్ వైట్ల, సూర్యనారాయణ, కల్యాణ్ కుమార్, నారాయణ, రామాంజి, రాయల్ మురళి పాల్గొన్నారు.
విస్తరించాలి
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీకి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలో జాతీయ రహదారులను మరింత విస్తరించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత.. కేంద్ర మంత్రిని కోరారు. ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. మంత్రి సవిత మాట్లాడుతూ.. పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం, హిందూపురం పార్లమెంటు పరిధిలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముదిగుబ్బ నుంచి పెనుకొండ మీదుగా చెళ్లకెర వరకు అంతర్రాష్ట్ర రహదానిని విస్తరించాలనీ, సోమందేపల్లి నుంచి హిందూపురం, దొడ్డబళ్లాపురం మీదుగా యలహంక వరకు వెళ్లే రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలనీ, హైదరాబాద్-బెంగళూరు ఎనహెచ-44ను ఆరులైన్ల రహదారిగా విస్తరించాలని కేంద్రమంత్రిని ఆమె కోరారు.
జిల్లా కేంద్రంతో అనుసంధానించాలి
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని జాతీయ రహదారులతో అనుసంధానించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి.. కేంద్ర మంత్రి నితిన గడ్కరీని కోరారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చేపట్టిన జాతీయ రహదారుల పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రహదారుల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
రాష్ర్టాల రహదారులను కలపాలి
ఆంధ్రప్రదేశ సరిహద్దులోని కర్ణాటకతో రహదారులను అనుసంధానించి విస్తరించేలా చర్యలు తీసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. కేంద్రమంత్రి నితిన గడ్కరీని కోరారు. అనంతపురం-ఎగువపల్లి రహదారి సమస్యను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరారు. డబుల్‌లైనగా విస్తరించాలని వినతిపత్రం సమర్పించారు. ఇందుకు రూ.35 కోట్లు నిధులు అవసరమవుతాయని వాటిని మంజూరు చేయాలని కోరారు.
జాతీయ రహదారితో అనుసంధానించాలి
పుట్టపర్తి నుంచి మడకశిర మీదుగా హిరియూర్ వరకు రోడ్లను ఎనహెచ 44తో అనుసంధానం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కోరారు. పుట్టపర్తి నుంచి పెనుకొండ, మడకశిర, గుడిబండ, అమరాపురం మండలాల మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని హిరియూర్ వరకు ఎనహెచ 44కు అనుసంధానం చేయాలని విన్నవించారు.