Share News

SEVAGHAD: రేపటి నుంచి సేవాఘడ్‌ ఉత్సవాలు

ABN , Publish Date - Feb 11 , 2025 | 11:54 PM

సంతసేవాలాల్‌ జయంత్యుత్సవాలు గురువారం నుంచి సేవాఘడ్‌లో ప్రారంభంకానున్నాయి. సంత్‌సేవాలాల్‌ 286 సంవత్సరాల కిందట జన్మించి ఎన్నో మహిమలను చూపి, సుగాలీ జాతి జాగృతి కోసం ఆరాటపడిన మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు.

SEVAGHAD: రేపటి నుంచి సేవాఘడ్‌ ఉత్సవాలు

గుత్తిరూరల్‌, ఫిబ్రవరి11(ఆంధ్రజ్యోతి): సంతసేవాలాల్‌ జయంత్యుత్సవాలు గురువారం నుంచి సేవాఘడ్‌లో ప్రారంభంకానున్నాయి. సంత్‌సేవాలాల్‌ 286 సంవత్సరాల కిందట జన్మించి ఎన్నో మహిమలను చూపి, సుగాలీ జాతి జాగృతి కోసం ఆరాటపడిన మహోన్నత వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈక్రమంలోనే దేశంలోని బంజారాల చేత పూజింపబడుతున్నారు. అలాంటి మహనీయుడి జన్మస్థానం గుత్తి మండలంలోని సేవాఘడ్‌. ఎన్నో పరిశోధనల అనంతరం 25 ఏళ్ల కిందట చెర్లోపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఓ గ్రామ శిథిలాల ఆధారంగా సేవారాజ్‌ మహరాజ్‌ గ్రామం సేవాలాల్‌ స్వగ్రామంగా గుర్తించారు. దానికి సేవాఘడ్‌ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారా ట్రస్టు అధ్వర్యంలో 14, 15 తేదీలలో జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఉత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే అధికారులతో సమీక్షించారు. భక్తుల కోసం చేపట్టాల్సిన సౌకర్యాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

గుత్తికోట ఆధారంగా గుర్తింపు

బంజారాల ధార్మిక పరిషత్‌ ఆధ్వర్యంలో అన్వేషణ సాగించి గుత్తి కోట ఆధారంగా సేవాలాల్‌ జన్మస్థలాన్ని గుర్తించారు. 2000వ సంవత్సరం నుంచి సేవాలాల్‌ జయంతి వేడుకలను సేవాఘడ్‌లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తొమ్మిదేళ్ల కిందట రూ.1.20 కోట్లతో మాతా జగదాంబ ఆలయాన్ని నిర్మించారు. ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయంలో 2016లో అమ్మవారి విగ్రహాన్ని పత్రిష్ఠించారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి బంజారాలు పెద్ద సంఖ్యలో వస్తారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా బంజారాలు సేవాఘడ్‌కు రానున్నారు.

Updated Date - Feb 11 , 2025 | 11:54 PM