Puttaparthi Celebrations: కన్నుల పండువగా సత్యసాయి శతజయంతి వేడుకలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 09:59 AM
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వెండి రథంపై సత్యసాయి బాబా పుట్టపర్తి పురవీధులలో ఊరేగనున్నారు.
సత్యసాయి జిల్లా, నవంబర్ 18: జిల్లాలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు (Sathya Sai Baba Centenary) కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈరోజు (మంగళవారం) వేద పండితుల మంత్రోచ్ఛారణలతో రథోత్సవ వేడుకను సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు. నూతన వెండి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో వెండి రథంపై 9 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి బాబా ఉత్సవ మూర్తి పట్టణ పురవీధులలో ఊరేగనున్నారు. శత జయంతి ఉత్సవాల్లో కళా జాతర బృందాలు విశేష ఆకర్షణగా నిలిచాయి.
అలాగే కీలుగుర్రాలు, డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. సాయి నామస్మరణతో పుట్టపర్తి మారు మ్రోగుతోంది. రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి పురవీధులలో సాయి భక్తులు బారులు తీరారు. స్వదేశీ విదేశీ భక్తులతో పుట్టపర్తి కిటకిటలాడుతోంది. సత్యసాయి బాబు శత జయంతి వేడుకల సందర్భంగా పట్టణంలో పెద్ద ఎత్తున పచ్చటి తోరణాలు ఏర్పాటు చేశారు.
మరోవైపు సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఈరోజు సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ , మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, సవిత పుట్టపర్తికి చేరుకోనున్నారు. వివిఐపీలు రాక దృష్టిలో ఉంచుకొని కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పుట్టపర్తిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
అలాగే రేపు (ఈనెల 19న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పుట్టపర్తికి రానున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన శతజయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు ఘన స్వాగతం పలుకనున్నారు.
ఇవి కూడా చదవండి...
ర్యాగింగ్ కలకలం... పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు
కుల, మత రాజకీయాలు శాశ్వతంగా నడవవు
Read Latest AP News And Telugu News