AGRICULTURE: పొలుసు పురుగు నివారణపై అవగాహన
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:14 AM
పొలసు పురుగు నివారణపై చీనీ రైతులకు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. చీనీని పీడిస్తున్న పొలుసు అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది.

ధర్మవరం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): పొలసు పురుగు నివారణపై చీనీ రైతులకు జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. చీనీని పీడిస్తున్న పొలుసు అన్న శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. ఇందుకు స్పందించి ఉద్యానశాఖ అధికారి తాడిమర్రి మండలంలోని కునుకుంట్ల గ్రామంలో చీనీ పంటను పరిశీలించారు. పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రైతులతో మాట్లాడుతూ ముఖ్యంగా చీనీ చెట్లకు పొలుసు పురుగు, వేరుకుళ్లు తెగుళ్ల సోకడంతో చెట్లు చనిపోతున్నాయని తెలిపారు. తోటలకు తప్పనిసరిగా మైలుతుత్తి మట్టి సున్నం కలిపిన మిశ్రమాన్ని ఏడాదిలో కనీసం రెండుసార్లు పూయాలన్నారు. బంకతెగుళ్లు, పొలుసు పురుగులను నివారించవచ్చన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త రామసుబ్బయ్య మాట్లాడుతూ రైతులు ఏడాదికి రెండు మూడు సార్లు చీనీ చెట్లకు పశువుల ఎరువు, వేపపిండి ట్రైకోడెర్మా విరిడల మిశ్రమాన్ని 10కిలోల చొప్పున వేసుకోవడం ద్వారా వేరుకుళ్లు నివారించవచ్చన్నారు. తోటలో కలుపు మందులు వాడటం వల్ల చీనీ చెట్ల వేర్లు దెబ్బతిని చనిపోతున్నాయన్నారు. రైతులు కలుపు నివారణకు మందులుకొట్టకుండా పచ్చిరొట్ట ఎరువులు వేయాలన్నారు. స్థానిక ఉద్యాన అధికారి అమరేశ్వరి, వ్యవసాయ అధికారి రమాదేవి, రైతుసేవా కేంద్రం అధికారులు గౌతమి, జయచంద్ర పాల్గొన్నారు.