SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:22 AM
స్థానిక బోగసముద్రం చెరువులోని యోగముద్ర ఈశ్వరుడి వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు చెరువు జలవన సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

పుణ్యస్నానాలకు అవకాశం
పెనుకొండ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): స్థానిక బోగసముద్రం చెరువులోని యోగముద్ర ఈశ్వరుడి వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు చెరువు జలవన సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు. శనివారం చెరువు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు పాపారాయుడు, రమే్‌షరాయల్, రాజశేఖర్‌రెడ్డి, వినోద్‌కుమార్, గిరి, చంద్రమౌళి, శ్రీరామ్, పూర్ణా తదితరులు మాట్లాడుతూ.. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 25న అంకురార్పణ, కళశపూజ, గణపతి, గంగపూజ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 26న శివరాత్రి పండగ సందర్భంగా ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 12గంటల వరకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 12 నుంచి ఉదయం 5గంటల వరకు కాంతార సాంస్కృతిక నృత్యాలు, కేరళ వాయిద్య బృందంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాధ్యాన యోగేశ్వర స్వామి సన్నిధిలో శివరాత్రి జాగరణ చేసి భక్తులందరూ పునీతులు కావాలని కోరారు.
నేడు బోగసముద్రం చెరువులో పుణ్యస్నానాలు
స్థానిక బోగసముద్రం చెరువులో జల వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ప్రయాగ్‌రాజ్ నుంచి తెచ్చిన గంగ, యమున, సరస్వతి, పవిత్ర జలాలతో బోగసముద్రం చెరువులో పవిత్ర స్నానాలు చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9గంటలకు ఊరువాకిలి ఆంజనేయస్వామి ఆలయం నుంచి మేళ తాళాలతో ఊరేగింపుగా పవిత్ర జలాల కళశాలను బోగసముద్రం చెరువువద్దకు తీసుకెళతామన్నారు. శివలింగానికి అభిషేకం చేసి ఆ పవిత్ర జలాలను బోగసముద్రం చెరువులో కలిపి భక్తులకు మహాకుంభమేళ పవిత్రస్నానాలకు అవకాశం కల్పిస్తామన్నారు. చెరువులో దిగి స్నానం చేయలేని వృద్ధులు, పిల్లల కోసం వడ్డున షవర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.