ROAD ACCIDENT: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:26 AM
పెళ్లి అయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదం ఓ యువకుడిని బలిగొంది. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా.. ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలు
కదిరి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): పెళ్లి అయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదం ఓ యువకుడిని బలిగొంది. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా.. ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కదిరి మున్సిపాలిటి కుటాగుళ్లలోని పులివెందుల క్రాస్ వద్ద శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మోటార్ సైకిల్‌లో వెళుతున్న దాదాపీర్(26) అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంటర్ విద్యార్థి సయ్యద్ బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. కదిరి అడపాల వీధికి చెందిన దాదాపీర్ మడకశిర తపాలా కార్యాలయంలో పనిచేస్తున్నాడు. వరుసకు తమ్ముడైన నిజాంవలీ కాలనీకి చెందిన సయ్యద్ బాషా అనే ఇంటర్ విద్యార్థి స్థానిక బ్లూమూన కళాశాలలో పరీక్ష రాస్తున్నాడు. పరీక్ష అనంతరం కళాశాల నుంచి మోటార్ సైకిల్‌పై కదిరికి వస్తున్నారు. ఇదే సమయంలో కదిరి నుంచి ప్రొద్దుటూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు కుటాగుళ్లలోని పులివెందుల క్రాస్ వద్దకు రాగానే మోటర్ సైకిల్‌ను ఢీకొంది. దీంతో మోటార్‌సైకిల్ నడుపుతున్న దాదాపీర్ అక్కడిక్కడే మరణించగా సయ్యద్ బాషా తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని 108 ద్వారా ప్రభుత్వ కదిరి ఆసుపత్రికి చేర్చారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
పెళ్లైన నెల రోజులకే..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దాదాపీర్ పోస్టల్ ఉద్యోగి. మడకశిరలో పనిచేస్తున్నాడు. పెళ్లై దాదాపు 40 రోజులయింది. దాదాపీర్ తల్లి, ఇంటర్ విద్యార్థి సయ్యద్ తల్లి అక్క, చెల్లెళ్లు. వరుసకు తమ్ముడైన సయ్యద్‌బాషా ఇంటర్ మొదటి రోజు పరీక్షకు బ్లూమూన కళాశాలకు వెళ్లాడు. పరీక్ష రాసిన సయ్యద్‌ను పిలుచుకు వస్తుండగా.. కుటాగుళ్ల వద్దకు జరిగిన ప్రమాదంలో దాదాపీర్ అక్కడిక్కడే మృతి చెందాడు. దాదాపీర్ మరణ వార్త తెలియగానే అతడి భార్య, తల్లి ఇతర బంధువులు ఆసుపత్రికి చేరుకున్నారు. శవాన్ని చూసి కన్నీరు, మున్నీరయ్యారు. పెళ్లైన నెలకే భర్త మరణించడంతో ఆమె రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. చేతికొచ్చిన కొడుకు ఉన్నట్టుండి చనిపోవడంతో విలపించిన తల్లిదండ్రులను చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
మొదటి పరీక్ష రాస్తూనే...
స్థానిక స్పేస్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సయ్యద్‌బాషా మొదటి రోజు పరీక్ష రాయడానికి బ్లూమూన కళాశాలకు వెళ్లాడు. పరీక్ష రాసి ఇంటికి వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. మొదటిరోజు పరీక్ష రాస్తూనే ప్రమాదం జరగడంపై తల్లి దండ్రుల రోదలనతో ఆసుపత్రి దద్దరిల్లింది.