Share News

Ananthapuram News: మీన రాసి.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద

ABN , Publish Date - Nov 21 , 2025 | 09:07 AM

నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది.

Ananthapuram News:  మీన రాసి.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద

- పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి

- ఏటా 4 కోట్ల చేపపిల్లల ఉత్పత్తి

- ఐదు రకాల చేపలు...

- రూ.80 కోట్ల పైబడి ఆదాయం

- నేడు ప్రపంచ మత్స్య దినోత్సవం

అనంతపురం: నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది. దీంతో జిల్లా చేపలను పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా ఏడాదికి రూ.80కోట్లపైగా ఆదాయం గడిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా అనంతపురం, ఎంపీ డ్యాం, పీఏబీఆర్‌, బీటీపీ మత్స్యక్షేత్రాల్లో చేపపిల్లల పెంపకం చేపడుతున్నారు. అక్కడి పెరిగిన రెండు నుంచి మూడు ఇంచుల పిల్లలను చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లకు పంపుతున్నారు. ఈ ఏడాది అధికారుల లెక్కల ప్రకారం... అనంతపురం మత్స్యక్షేత్రంలో కట్ల 20 లక్షలు, రోహు 40 లక్షలు, బంగారుమీన(మృగాల) 20 లక్షలు, బంగారుతీగ(చిప్లీస్‌) 2 లక్షలు చొప్పున మొత్తం 82 లక్షల చేపపిల్లలను ఉత్పత్తి చేశారు.


ఎంపీ డ్యాం మత్స్యక్షేత్రంలో కట్ల 20 లక్షలు, రోహు 50 లక్షలు, బంగారుమీన 10 లక్షలు, బంగారుతీగ లక్ష చొప్పున మొత్తం 81 లక్షలు, పీఏబీఆర్‌ మత్స్యక్షేత్రంలో కట్ల 50లక్షలు, రోహు 80 లక్షలు, బంగారుమీన 20 లక్షలు, బంగారుతీగ 2 లక్షలు మొత్తం 1.52 కోట్లు, బీటీపీ మత్స్యక్షేత్రంలో కట్ల 30 లక్షలు, రోహు 30 లక్షలు, బంగారుమీన 15 లక్షలు, బంగారుతీగ 2 లక్షలు మొత్తం 77 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. ప్రతి ఏడాది దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకూ చేపపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు.


zzzz.jpg

ఉమ్మడి జిల్లాలో దాదాపు 110 సొసైటీలున్నాయి. ఈ సొసైటీల పరిధిలో దాదాపు 150 చెరువులు, 20 జీపీ ట్యాంకులు, రిజర్వాయర్లు ఉన్నాయి. దాదాపు అన్ని చెరువులు, జీపీ ట్యాంకులు, రిజర్వాయర్లు, డ్యాంలు కలిపి మొత్తం 10 వేల హెక్టార్ల విస్తీర్ణంలో చేపల పెంపకాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా చెరువులు, డ్యాంలు, రిజర్వాయర్లలో ప్రధానంగా ఐదు రకాల చేపలను పెంచుతున్నారు. కట్ల, రోహు, బంగారుమీన, బంగారు తీగ, గడ్డిచేప రకం చేపలను పెంచుతున్నారు. ప్రధానంగా కట్ల చేప జిల్లాలో దాదాపు సంవత్సరానికి 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల వరకూ ఉత్పత్తి అవుతున్నాయి. రోహు 2 కోట్లు, మృగాల 65 లక్షలు, చిప్లీస్‌ 10 లక్షలు, గడ్డిచేప 4 లక్షల నుంచి 5 లక్షల వరకూ తయారవుతున్నాయి.


జిల్లాలో ఐదు రకాల చేపల పెంపకంతో ఏటా రూ. 80 కోట్లకుపైగా ఆదాయం వస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. కట్లా చేప ద్వారానే అధిక ఆదాయం వస్తోంది. ఏడాదికి దాదాపు 3 వేల టన్నులు కట్ల చేపలు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా రూ. 36 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. రోహు చేపలు ఏడాదికి 1000 టన్నులు ఉత్పత్తి కాగా... రూ. 12 కోట్లు ఆదాయం వస్తోంది. బంగారుమీన రకం చేపలు ఏడాదికి 1000 టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి విలువ రూ. 12 కోట్లు, బంగారుమీన రకం చేపలు ఏడాదికి 2 వేల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా దాదాపు రూ.24 కోట్ల ఆదాయం వస్తోంది. గడ్డిచేపలు ఏడాదికి 20 టన్నుల వరకూ ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా రూ.2 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది.


జిల్లాలో పెరిగే ఐదు రకాల చేపలను కోల్‌కతా, హైదరాబాద్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కోల్‌కతాలోని హౌరా మార్కెట్‌కు అనంత మత్స్య సంపదను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. కట్ల రకం చేపలు దాదాపు 3 వేల టన్నులు కోల్‌కతా, హైదరాబాద్‌లకు ఎగుమతి చేస్తున్నారు. రోహు వెయ్యి టన్నులు కలకత్తాలోని హౌరా మార్కెట్‌తో పాటు హైదరాబాద్‌, కర్ణాటక, బంగారుమీన రకం చేపలు కోల్‌కతాతో పాటు కర్ణాటక, హైదరాబాద్‌, తమిళనాడులకు ఎగుమతి చేస్తున్నారు. బంగారుతీగ రకం చేపకు జిల్లాలో అధికంగా డిమాండ్‌ ఉండటంతో వీటిని ఎగుమతి చేయడం లేదు.


zzzzzzzzz.jpg

సహజ వనరు తిలాపియా...

జిల్లాలో అసలు ఖర్చు లేకుండా సహజంగా పెరిగే చేప తిలాపియా(జిలేబీ). వీటి కోసం ప్రత్యేకంగా స్పాన్‌(గుడ్డు) పెట్టించడం, రేరింగ్‌ ప్రక్రియ, చేపపిల్లల ఉత్పత్తి, వాటిని ప్రత్యేక పరిస్థితుల్లో పెంచడం లాంటివి ఉండవు. ఈ చేపకు గుడ్డు ప్రక్రియ ఉండదు. ఈ చేప సహజంగా పెరగడంతో పాటు, పిల్లలను అదే నోటి ద్వారా బయటకు వదులుతుంది. నీటిలో సహజసిద్ధంగా దొరికే ఆహారాన్ని తింటూ పెరుగుతాయి. ఏడాది కాలంలో దాదాపు కేజీ సైజులో పెరుగుతుంటాయి. జిల్లాలో ఏడాదికి దాదాపు 500 టన్నుల వరకూ ఉత్పత్తి అవుతోంది. వీటి ద్వారా దాదాపు రూ.5 కోట్ల వరకూ ఆదాయం వస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపలను కేరళ, కలకత్తా, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు.


ప్రతి ఏటా 100 టన్నులు

బుక్కరాయసముద్రం సొసైటీ పరిధిలో ప్రతి ఏటా దాదాపు 100 టన్నులకుపైగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. చెరువులో కట్ల, రోహు, బంగారు తీగ, గడ్డిచేపలు, జిలేజీలు పెంచుతున్నారు. 1947 సంవత్సరంలో 23 మంది సభ్యులతో సొసైటీ ఏ ర్పాటైంది. ప్రస్తుతం 133 మంది సభ్యులున్నారు. సంవత్సరానికి దాదాపు రూ. 30 లక్షలకు పైగా ఆ దాయం వస్తోంది. గతంతో పోల్చుకుంటే ఈసారి ఆదాయం బాగానే ఉంది. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

- నగేష్‌, మత్స్యసహకార సంఘం జిల్లా అధ్యక్షుడు, బుక్కరాయసముద్రం మండలం


జిలేబీలే అధికం

పీఏబీఆర్‌ డ్యాంలో కట్ల, రోహు, జిలేజీల పెంపకం చేపడుతున్నాం. ప్రస్తుతం డ్యాంలో నీరు ఎక్కువగా ఉండటంతో జిలేబీలే అధికంగా పడుతున్నాం. కట్ల, రోహు పరిమితికి లోబడి పడుతున్నాం. సొసైటీలో 170 మంది సభ్యులున్నారు. జిలేబీలే ఏడాదికి 200 టన్నులకుపైగా ఉత్పత్తి అవుతున్నాయి. టన్ను రూ.40 వేలు పలుకుతోంది. ఇక కట్ల, రోహు చేపలు కేజీ 100 నుంచి రూ. 120లకు అమ్ముతున్నాం. మొత్తం మీద ఏడాదికి రూ. 30లక్షలకు పైబడి ఆదాయం వస్తోంది.

- బెస్త జగదీష్‌, అధ్యక్షుడు, పీఏబీఆర్‌ డ్యాం సొసైటీ, కూడేరు మండలం


చేపల సైజు పెరగడం లేదు..

శింగనమల చెరువులో అన్ని రకాల చేపలు పెంచుతున్నాం. అయితే చేపలు అనుకున్న సైజులో పెరగడం లేదు. అనంతపురం, చెరువు పై ప్రాంతాల్లో నుంచి వచ్చే పరిశ్రమల కలుషితపు నీటితో చేపలు వృద్ధి చెందడం లేదు. చేపలు నల్లగా మారుతుండటంతో మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉంటోంది. ప్రభుత్వం స్పందించి కలుషిత నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవాలి.

- చిన్న ఆంజనేయులు, మత్స్యకారుడు, శింగనమల మండలం


వర్షాధారంతోనే...

బీటీ ప్రాజెక్టుతో పాటు ఇతర చెరువుల్లో వర్షాధారంగా చేపల పెంపకం ఉంటోంది. వేసవిలో చెరువుల్లో, రిజర్వాయర్లు నీరు ఇంకిపోతే మత్స్యకారులకు ఉపాధి ఉండదు. వదిలిన చేపల సైతం బరువు పెరగవు. ప్రస్తుతం బీటీపీ రిజర్వాయర్‌తో పాటు చెరువుల్లో సమృద్ధిగా వర్షపునీరు చేరడంతో చేపల పెంపకం లాభదాయకంగా ఉంది. ఒక్కో మత్స్యకారుడు రోజుకు 20 కేజీల నుంచి 50 కేజీల వరకు వేటాడుకుని విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడు. రిజర్వాయర్‌కు హంద్రీనీవా జలాలు చేరితే మత్స్యకారులకు నిత్యం చేపల పెంపకంతో ఆదాయం లభిస్తుంది.

- బెస్త శ్రీరాములు, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2025 | 09:41 AM