Tummala: రైతు భరోసాపై బీఆర్‌ఎస్ కొత్త నాటకం
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:25 AM
రైతు భరోసాపై బీఆర్‌ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.

పదేళ్లలో రైతులను ముంచేసి.. ఇప్పుడు డ్రామాలు
రైతుబంధుతో 21వేల కోట్లు దుర్వినియోగం
బహిరంగ లేఖలతో అన్నదాతలను గందరగోళపర్చే యత్నం: తుమ్మల
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాపై బీఆర్‌ఎస్ నేతలు కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ‘రైతు భరోసా’పై చర్చ పెట్టి అభిప్రాయాలు చెప్పాలని అడిగితే.. బీఆర్‌ఎ్‌సకు చెందిన మాజీ మంత్రులు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్, హరీశ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మంత్రి తుమ్మల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఒకే ఒక ‘రైతుబంధు’లో కూడా రూ.21 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. అలాంటి వాళ్లు ఇప్పుడు తమ ప్రభుత్వం కొన్ని మార్పులు చేసి సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇద్దామని అంటే కొత్త కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని ధ్వజమెత్తారు. లేఖలతో రైతులను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నారన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో 35 శాతం ప్రకటించి, ఖర్చు చేసినందుకా ఈ ప్రభుత్వాన్ని నిలదీయమంటున్నారు? అని ప్రశ్నించారు. రైతుబంధు పథకంలో 2019-20లో రెండు పంట కాలాల్లో మీరు పూర్తిగా డబ్బులు చెల్లించని మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. 2023 యాసంగి రైతుబంధు రూ.7,600 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. పంట నష్టం సంభవిస్తే పరిహారం ఇవ్వకపోగా.. కనీసం రైతులను పరామర్శించని వారు, నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం చెల్లించిన ఈ ప్రభుత్వాన్నా ప్రశ్నించమనేది? అని దుయ్యబట్టారు.
కార్పొరేషన్ల పనితీరు మార్చుకోవాలి!
ప్రతి కార్పొరేషన్ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కార్పొరేషన్ల ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ల పనితీరు మార్చుకొని, ప్రభుత్వ ప్రాధమ్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో వ్యవసాయ, చేనేత అనుబంధ కార్పొరేషన్ల ఎండీలు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉద్యాన శాఖ ద్వారా హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలోని అన్ని జిల్లాల్లో పలు రకాల కూరగాయలు పండించడానికి, వాటి మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.