Share News

Smita Sabharwal: తెలియదు.. నాకు గుర్తులేదు..!

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:58 AM

కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ చిత్రమైన జవాబులు ఇచ్చారు. కమిషన్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె.. ‘తెలియదు.. నాకు గుర్తులేదు.. మరిచిపోయా’ అనే సమాధానాలు ఇవ్వడం గమనార్హం.

Smita Sabharwal: తెలియదు.. నాకు గుర్తులేదు..!

  • కాళేశ్వరం కమిషన్‌ ప్రశ్నలకు

  • స్మితాసబర్వాల్‌ సమాధానాలు

  • బ్యారేజీలు ఎప్పుడు ప్రారంభించారో

  • తెలియదు: మాజీ సీఎస్‌ సోమేశ్‌

  • నేడు విచారణకు వెదిరె శ్రీరామ్‌,

  • ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం

  • కమిషన్‌కు మాజీ సీఎస్‌ సోమేశ్‌ సమాధానం

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ చిత్రమైన జవాబులు ఇచ్చారు. కమిషన్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె.. ‘తెలియదు.. నాకు గుర్తులేదు.. మరిచిపోయా’ అనే సమాధానాలు ఇవ్వడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి 2023 డిసెంబరు దాకా సీఎంవో కార్యదర్శిగా ఉంటూ నీటిపారుదల శాఖ వ్యవహారాలు చూసిన స్మితను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా గురువారం జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రశ్నించింది. ‘మంత్రివర్గ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ సమ్మతి లేకుండానే కేవలం సీఎం ఆమోదంతో మేడిగడ్డ బ్యారేజీకి రూ.2591 కోట్లు, అన్నారం బ్యారేజీకి రూ.1785 కోట్లు, సుందిళ్ల బ్యారేజీకి రూ.1437 కోట్లతో 2016 మార్చి 1న పరిపాలన అనుమతులు జారీ చేశారా?’ అని ప్రశ్నించగా.. ‘నాకు తెలియదు’ అని స్మిత బదులిచ్చారు. మంత్రి(టి.హరీశ్‌) స్వయంగా సీఎం వద్దకు ఫైల్స్‌ తీసుకెళ్లి ఆమోదం తీసుకొని ఉండొచ్చని, సీఎం వద్దకు వెళ్లే ప్రతీ ఫైల్‌ తన ద్వారానే వెళ్లదని, కొన్ని సందర్భాల్లో నేరుగా కూడా తీసుకెళతారని చెప్పారు.


మీరు సీఎంవో కార్యదర్శిగా ఎప్పటి నుంచి పనిచేశారు? క్యాబినెట్‌ నిర్ణయాలన్నీ తెలుసా?

స్మిత: 2014 జూన్‌ నుంచి 2023 డిసెంబరు దాకా సీఎంవో కార్యదర్శిగా పనిచేశా. క్యాబినెట్‌ తీసుకునే నిర్ణయాలన్నీ తెలుసు.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు క్యాబినెట్‌

ఆమోదం ఉందా?

క్యాబినెట్‌ ఆమోదం ఉంది.

క్యాబినెట్‌ ఆమోదానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలకు

సీఎం అనుమతితో జీవోలు ఇచ్చినట్లు తెలుసా?

తెలియదు. సమాచారం లేదు. మంత్రి (హరీశ్‌రావు) నేరుగా సీఎం (కేసీఆర్‌) ఆమోదం తీసుకొని, జీవో జారీ చేసి ఉండొచ్చు. ఆ తర్వాత అనుమతి తీసుకొని ఉండొచ్చు.

మేడిగడ్డ బ్యారేజీ కోసం రూ.6.67 కోట్లతో సర్వేకు సీఎం ఆమోదంతో జీవో ఇచ్చారు.దానికి క్యాబినెట్‌ ఆమోదం తీసుకున్నారా?

ఆ జీవో విషయంలో ఏం జరిగిందో తెలియదు. కొన్ని సార్లు జీవోలిచ్చి, తర్వాత అనుమతి తీసుకుంటారు. నా ద్వారా ఏ ఫైలు వచ్చినా బిజినెస్‌ రూల్‌ ప్రకారం వచ్చిందా? లేదా? అనేది పరిశీలించి, ఫైలులో అంశాన్ని సీఎంకు నివేదించడమే నా బాధ్యత.

సీఎంవోలో మీ విధులు, బాధ్యతలేంటి?

జీవో నం.747 ద్వారా నాకు 7 శాఖల బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖలకు చెందిన అంశాలపై జిల్లాల్లో పర్యటించి, కలెక్టర్లు, శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టుల పనులు ముందుకు వెళ్లేలా చూడడం నా బాధ్యత.

సీఎంకు వెళ్లే ఫైలులో మీరేమైనా నోట్‌ రాస్తారా?

లేదు. ఏమైనా రిమార్కులు, ఉల్లంఘనలు జరిగితే పరిశీలించడం నా బాధ్యత.

ఏ శాఖ అయినా కాళేశ్వరంపై నోట్‌ పంపిందా?

నేను పనిచేసిన సమయంలో రాలేదు.


బ్యారేజీల ప్రారంభం తెలీదు: సోమేశ్‌

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో తనకు తెలియదని మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ ఎప్పుడు పూర్తయిందని కమిషన్‌ ప్రశ్నించగా.. తాను 2019 మే 2 నుంచి ఆగస్టు 18 దాకా మాత్రమే నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించానని సమాధానం ఇచ్చారు. బ్యారేజీ 2019 జూన్‌ 21న పూర్తవడం గమనార్హం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేరే నాటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మీ హయాంలో ఏమైనా సర్క్యులర్‌/జీవోలు ఇచ్చారా అని కమిషన్‌ ప్రశ్నించగా.. తెలియదని సోమేశ్‌ జవాబిచ్చారు. 2019 ఆగస్టు 6న జీవో నం.329ను మేడిగడ్డలో అదనపు పనుల కోసం మీరే జారీ చేశారు కదా? అని జీవోను చూపిస్తూ కమిషన్‌ ప్రశ్నించగా.. గుర్తులేదని చెప్పారు. మీ హయాంలో బ్యారేజీలు ఆర్థికంగా లాభదాయం కాదని ఏమైనా లేఖలు వచ్చాయా అని ప్రశ్నించగా.. రాలేదని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 6, 7, 8, 10, 12ను రెండేళ్లలో పూర్తిచేయాలని జీవో జారీ అయిన విషయం మీకు తెలుసా అని అడగ్గా.. ఆ సమయంలో తాను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్నానని తెలిపారు. పన్నులు ఏ మేరకు వసూలు చేశారని ప్రశ్నించగా.. ఆశాజనకంగానే వసూలు చేశానని సోమేశ్‌ బదులిచ్చారు. మూడు బ్యారేజీల నిర్మాణాలకు జీవోలను క్యాబినెట్‌ ఆమోదం తీసుకోకుండానే జారీ చేశారా అని ప్రశ్నించగా.. అన్నింటికీ క్యాబినెట్‌ ఆమోదం ఉంటుందన్నారు.

మిమ్మల్ని ఇంద్రనీలం కాపాడుతోంది: కమిషన్‌

ఎగ్జామినేషన్‌ ముగిశాక జస్టిస్‌ ఘోష్‌ సోమేశ్‌ను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ‘మిమ్మల్ని ఇంద్రనీలం (వేలికి ఉన్న ఉంగరంలోని వజ్రాన్ని చూసి) కాపాడుతోంది’ అని ఘోష్‌ వ్యాఖ్యానించగా.. ‘మీరు అస్ట్రాలజర్‌’ అని సోమేశ్‌ అన్నారు. దాంతో ‘నేను మీ నుదుటిని చూసి చెబుతున్నా’ అని ఘోష్‌ చెప్పారు.

  • కమిషన్‌ విచారణకు శుక్రవారం వెదిరె శ్రీరామ్‌తో పాటు ఎమ్మెల్సీ కోదండరామ్‌ హాజరుకానున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 03:58 AM