Share News

Film industry: బెనిఫిట్‌ లేదా పుష్పా!

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:15 AM

అల్లు అర్జున్‌ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు.. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం! ఎందుకు? అంటే.. సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి.

Film industry: బెనిఫిట్‌  లేదా  పుష్పా!

  • పుష్ప 2 ఎఫెక్ట్‌తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీవర్గాలు

  • ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్‌ ధరల పెంపు

  • లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు

  • ప్రభుత్వం అనుమతులతో ‘పుష్ప-2’ జోరు

  • ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు, రేట్ల

  • పెంపుతో రూ.280 కోట్ల అదనపు వసూళ్లు

  • సర్కారు నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం

  • బెనిఫిట్‌ షో ప్రభావం మిగతా ఆటలపై పడి

  • కొన్నాళ్లు థియేటర్‌ మూసేయాల్సిన పరిస్థితి

  • ఎగ్జిబిటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలు

(ఆంధ్రజ్యోతి - సినిమా డెస్క్‌): అల్లు అర్జున్‌ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు.. బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం! ఎందుకు? అంటే.. సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి. బెనిఫిట్‌ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కలెక్షన్లు రాబట్టుకునే అవకాశాలున్నాయి. ‘పుష్ప-2’ సినిమాకు.. బెనిఫిట్‌ షోలు, అదనపు షోలు, టికెట్‌ రేట్ల పెంపు కారణంగా అదనంగా రూ.280 కోట్లు వచ్చాయి! అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాలని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు. కానీ, సీఎం రేవంత్‌ రెడ్డి ‘బెనిఫిట్‌ షో’లు ఉండవు అని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. పైకి చిన్న విషయమని చెబుతున్నప్పటికీ.. సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే.. ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్‌ రేట్ల పెంపునకు, బెనిఫిట్‌ షోలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల పేద, మధ్యతరగతి ప్రేక్షకులపై భారం పడుతుందని.. పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసిన ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు కొన్నిరోజులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు! తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్‌ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది.


సినిమాపై భారీ అంచనాలు ఉండడంతోపాటు టికెట్‌ ధరల పెంపునకు, బెనిఫిట్‌ షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీసు దగ్గర పుష్ప రాజ్‌ పంటపండిందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్ల వసూళ్లు రాగా.. అందులో మెజారిటీ వాటా బెనిఫిట్‌ షోల ద్వారా వచ్చిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్ర్కీన్లు, మల్టీప్లెక్స్‌లు కలిపి సుమారు 1300 స్ర్కీన్లు ఉండగా, వెయ్యి స్ర్కీన్లలో ‘పుష్ప 2’ చిత్రం విడుదలయింది. దాదాపు 800 స్ర్కీన్లలో బెనిఫిట్‌ షోలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మూడు, ఏపీలో మల్టీప్లెక్స్‌ల్లో మూడు, సింగిల్‌ స్ర్కీన్లలో రెండు బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వాలు అనుమతించాయి. సగటున ప్రతి స్ర్కీన్‌లోనూ రెండు షోల చొప్పున లెక్కవేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 1600 వరకూ బెనిఫిట్‌ షోలు పడినట్లు! తెలంగాణలో టికెట్‌ ధరపై రూ.800 వరకూ పెంచుకునే వీలు కల్పించారు. దీంతో బెనిఫిట్‌ షోలకు టికెట్‌ ధరలు సింగిల్‌ స్ర్కీన్లలో సుమారు రూ.1000, మల్టీప్లెక్స్‌ల్లో రూ.1200 వరకూ పలికాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్‌ ధరను రూ.800గా నిర్ణయించారు. అలాగే.. మన దగ్గర 500 నుంచి 1500 దాకా రకరకాల సీటింగ్‌ సామర్థ్యం ఉన్న థియేటర్లున్నాయి. తక్కువలో తక్కువ ఒక్కో ‘షో’కూ ఐదొందల టికెట్లు చొప్పున తెగాయనుకున్నా.. రూ. 5 లక్షల ఆదాయం వచ్చినట్లే. అంటే మొత్తం 1600 బెనిఫిట్‌ షోలకు కలిపి రూ. 80 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాల అంచనా.


ఆ తర్వాతా..

బెనిఫిట్‌ షోలతో పాటు అదనపు ఆటలు, టికెట్‌ ధరల పెంపునకు సైతం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతించాయి. తెలంగాణలో మొదటి నాలుగు రోజులూ టికెట్‌ ధరపై రూ.150, ఆ తర్వాత ఎనిమిది రోజుల పాటు రూ.105, మరో ఏడు రోజులూ రూ.20 అధికంగా వసూలు చేసుకునే వీలు కల్పించింది. మల్టీప్లెక్స్‌ల్లో రూ.200, రూ.150, రూ.50 పెంపునకు అనుమతిచ్చింది. ఏపీ ప్రభుత్వం సింగిల్‌ స్ర్కీన్లలో టికెట్‌ ధరపై లోయర్‌ క్లాస్‌కు రూ.100, అప్పర్‌క్లా్‌సకు రూ.150 వరకూ పెంచుకునే అవకాశం ఇచ్చింది. మల్టీప్లెక్స్‌ల్లో రూ.200 పెంపునకు అవకాశం ఇచ్చింది. ఏపీలో 13 రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉన్నాయి. ఈ పెంపు వల్ల ‘పుష్ప 2’కు రెండువారాల్లో అదనంగా లభించిన వసూళ్లు రూ. 140 కోట్ల వరకూ ఉంటాయని ట్రేడ్‌ విశ్లేషకుల అంచనా. అదెలాగంటే.. రోజుకు నాలుగు ఆటల చొప్పున వెయ్యి స్ర్కీన్లలో నాలుగు వేల షోలు. గరిష్ఠంగా రూ.200 కనిష్ఠంగా రూ. 20 వరకూ అదనపు ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కాబట్టి సగటున రూ.50 పెంపును ప్రాతిపదికగా తీసుకున్నా ఒక స్ర్కీన్‌లో షోకు 500 టికెట్లు తెగితే అదనంగా రూ.25 వేలు ఆదాయం వస్తుంది. అంటే నాలుగు షోల మీద రూ. 1 లక్ష అవుతుంది. ఆ చొప్పున వెయ్యి స్ర్కీన్లలో కలిపి రోజుకు రూ.10 కోట్లు చొప్పున రెండు వారాల్లో రూ.140 కోట్లు వసూళ్లు అదనంగా దక్కాయని విశ్లేషకులు చెబుతున్నారు.


ఆ వసూళ్లు అదనం

రేట్ల పెంపుతోపాటు.. అదనపు షోలకూ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. సగటున రోజుకు ఒక అదనపు షో చొప్పున తీసుకున్నా వెయ్యి స్ర్కీన్లలో వెయ్యి షోలు. టికెట్‌ ధరలు రూ.300 నుంచి రూ.500 వరకూ పలికాయి. సగటున రూ.300 టికెట్‌ను పరిగణలోకి తీసుకున్నా షోకు 500 టికెట్లు చొప్పున అమ్ముడయ్యాయనుకుంటే రూ.లక్షన్నర ఆదాయం. అంటే విడుదలైన వెయ్యి స్ర్కీన్లలో రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తుంది. గురువారం నుంచి ఆదివారం వరకూ నాలుగు రోజుల పాటు రోజుకు ఒక అదనపు షో నడిచినా రూ.60 కోట్ల ఆదాయం వచ్చినట్టే! అంటే.. టికెట్‌ ధరల పెంపుతో రూ.140 కోట్లు, బెనిఫిట్‌ షోల రూపంలో రూ.80 కోట్లు, అదనపు షోల వల్ల రూ.60 కోట్ల చొప్పున మొత్తం కలిపి రెండు వారాల్లో రూ.280 కోట్లు అదనంగా కొల్లగొట్టినట్లే అనేది ట్రేడ్‌ వర్గాల మాట.


సంక్రాంతి వసూళ్లకు దెబ్బే

ఈ ఏడాది ‘పుష్ప 2, దేవర 1, గుంటూరు కారం, కల్కి 2898 ఏడీ’ లాంటి పలు పెద్ద చిత్రాలకు బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపుపై పునరాలోచన లేదని ముఖ్యమంత్రి తేల్చిచెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రభావం టాలీవుడ్‌పై ఎలా ఉండబోతోంది అనే చర్చ నడుస్తోంది. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం పెద్ద దెబ్బే. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘గేమ్‌చేంజర్‌’, వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకూ మహరాజ్‌’ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రాలకూ ‘పుష్ప 2’కు దక్కినట్లే అన్ని అనుమతులూ దక్కుతాయని చిత్రబృందాలు భావించాయి. కానీ.. ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక ప్రదర్శనలు, బెనిఫిట్‌షోలు లేకపోవడం వల్ల ఈ సినిమాల వసూళ్లు తీవ్రంగా దెబ్బతింటాయనీ, నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవ ని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. కళ్లు చెదిరే కలెక్షన్లకు టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉపయోగపడుతున్నాయి. అట్టర్‌ఫ్లాప్‌ సినిమాల టికెట్లు సైతం కొన్నిసార్లు అధిక ధరలకు అమ్మి మొదట్లోనే సొమ్ము చేసేసుకుంటున్నారు. సర్కారు నిర్ణయంతో ఇకపై ఇవేవీ కుదరవు. రెగ్యులర్‌ షోలతోనే పెద్ద సినిమాలు రిలీజ్‌ అయితే వాటి ఆదాయానికి భారీగా గండిపడినట్లే. ఓపెనింగ్స్‌తో రికార్డులు క్రియేట్‌ చేయాలనే స్టార్‌ హీరోలకూ ఈ పరిణామం ఇబ్బందికరమే. పారితోషికం అమాంతం పెంచుతున్న హీరోలు ఈ పరిణామాలతో కాస్త నెమ్మదించే అవకాశం ఉంది.


బలుపు కాదు వాపే

టాలీవుడ్‌లో గతంలో వారం రోజులకు వచ్చే వసూళ్లు కాస్తా ఇప్పుడు మూడు రోజులకే వస్తున్నాయంటే అది బలుపు కాదు వాపు మాత్రమే అని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ‘‘రూ.175ఉండాల్సిన ధరను కాస్తా.. సర్కారు నుంచి తెచ్చుకున్న అనుమతులతో రూ.1129 చేశారు. బెనిఫిట్‌ షోలో ఒక్క టికెట్‌కు పెట్టే ఖర్చుతో మామూలు రోజుల్లో ఆరుసార్లు సినిమా చూడొచ్చు’’ అని ఆ వర్గాలవారు పేర్కొంటున్నారు. రూ.100 ఉండాల్సిన టికెట్‌ను రూ.300 చేయడం వల్ల రూ.100 కోట్ల వసూళ్లు రావాల్సిన చోట రూ.300 కోట్లు వస్తున్నాయంటున్నారు. భారీ వసూళ్లకు ఇవన్నీ కారణాలని.. ఇది పేద జనాలను, అభిమానులను దోచుకోవడం కాక మరేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. బెనిఫిట్‌ షో టికెట్‌ ధర రూ.1000 ఉంటే కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ ఆఫీసుల ద్వారా బ్లాక్‌లో అదే టికెట్‌ను రూ.3వేలకు అమ్ముతున్న అనైతిక విధానాల గురించి వారు ప్రస్తావిస్తున్నారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబం సైతం ‘పుష్ప 2’ చూసేందుకు బ్లాక్‌లో 3 టికెట్లను రూ.12వేల కు కొన్న సంగతి తెలిసిందే. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మున్ముందు చిత్ర పరిశ్రమ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే.. నిర్మాతలు మాత్రం అంతర్జాతీయ స్థాయి సినిమాలు తీయాలంటే భారీగా ఖర్చు పెట్టాలని.. అదనపు షోలు లేకపోతే తిరిగి రాబట్టుకోలేమని అంటున్నారు.


సర్కారు నిర్ణయంతో థియేటర్లకు మంచి రోజులు

బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం అనుమతులు నిరాకరించడాన్ని ఎగ్జిబిటర్స్‌ అసోషియేషన్‌, థియేటర్స్‌ యాజమాన్యాలు స్వాగతిస్తున్నాయి. వాటి వల్ల థియేటర్ల యజమానులకు ఒక్కపైసా అదనపు ఆదాయం లేదని వారు వాపోతున్నారు. రోజుకు ఐదు, ఆరు, ఏడు షోలు వేయడం వల్ల అదనంగా ఎవరికైనా ఉపాధి లభించిందా? అనే ప్రశ్న వారి నుంచి వినిపిస్తోంది. నిజానికి.. బెనిఫిట్‌ షోల విషయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వైఖరిపై అసంత ృప్తితో ఉన్న ఎగ్జిబిటర్లు ఈ ఏడాది మేలోనే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా, తర్వాత వెనక్కు తగ్గారు. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్నట్టే తమకు కూడా పర్సంటేజీ విధానం ఇవ్వాలని నిర్మాతల మండలిని డిమాండ్‌ చేసినా, కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చింది. టికెట్‌ ధరలు తగ్గి, బెనిఫిట్‌ షోలు బంద్‌ చేస్తే థియేటర్లకు లాంగ్‌ రన్‌ వచ్చి పరోక్షంగా తమకు లాభం కలుగుతుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఒక వారంలో రూ.15లక్షల వసూళ్లు వస్తాయనుకుంటే ఒక్క బెనిఫిట్‌ షో ద్వారానే రూ.7లక్షల వరకూ లాగేస్తున్నారనీ, దీని ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్ని రోజులు థియేటర్‌ను మూసేయాల్సి వస్తోందని.. ఫలితంగా తాము అద్దెను కోల్పోతున్నామని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ థియేటర్‌లో పెద్ద హీరో సినిమాకు బెనిఫిట్‌ షో వేస్తే రూ.13 లక్షల వసూళ్లు వచ్చాయి. కానీ థియేటర్‌ యజమానికి మాత్రం ఒప్పందం ప్రకారం ఆటకు రూ.20 వేలు చొప్పున కిరాయి మాత్రమే దక్కింది. మిగిలిన సొమ్మంతా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల చేతికి వెళ్లింది. వసూళ్లు పడిపోతే మాత్రం ఆ మేరకు థియేటర్‌ యజమానికిచ్చే అద్దెని కూడా తగ్గిస్తున్నారు.


ప్రాఫిట్‌ షో కాదు

సినిమా విడుదలైన కొన్ని వారాల వరకూ టికెట్‌ ధరల పెంపు విధానం అమల్లో ఉండడం వల్ల సాధారణ ధరతో సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు వేచి చూడాల్సి వస్తోంది. గతంలో బెనిఫిట్‌ షో అనేది ప్రాఫిట్‌ షో కాదు. ఎంపిక చేసిన కొన్ని సినిమాలకు మాత్రమే బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేది. అలా వచ్చిన వసూళ్లను ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు బెనిఫిట్‌ షో సంస్కృతి మారిందని.. వచ్చిన సొమ్మంతా నిర్మాతలు, హీరోల జేబుల్లోకి పోతోందని.. ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒక కుటుంబం బెనిఫిట్‌ షోకు వెళితే రూ.5-10వేల వరకూ ఖర్చు అవుతోంది. సినిమా ఫ్లాప్‌ అని జనాలకు తెలిసేలోపు డబ్బులు గుంజేయడానికి ఈ విధానం అక్కరకొస్తోంది తప్ప.. ప్రేక్షకులకు, అభిమానులకు ఏం ఉపయోగం ఉండట్లేదు!!

Updated Date - Dec 30 , 2024 | 04:15 AM