Ayodhya Ram Mandir: రాముడు అయోధ్యకి రావట్లేదు.. కలలోకి వచ్చి చెప్పాడు
ABN , Publish Date - Jan 15 , 2024 | 12:14 PM
Tej Pratap Yadav On Ram Mandir Inauguration: ఒకవైపు అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతుండగా.. మరోవైపు రాజకీయ నేతలు ఈ వేడుకపై అనూహ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకవైపు అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతుండగా.. మరోవైపు రాజకీయ నేతలు ఈ వేడుకపై అనూహ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు తన కలలోకి వచ్చారని, తాను ఈ రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తనతో చెప్పారని పేర్కొన్నారు. ఒక బహిరంగ సభలో భాగంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
‘‘ఎన్నికలు ముగిసిన తర్వాత రాముడ్ని మర్చిపోతారు. జనవరి 22వ తేదీనే రాముడు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే రాముడు నలుగురు శంకరాచార్యుల కలల్లోకి వచ్చారు. నా కలలోకి రాముడు వచ్చారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి రానని చెప్పారు. ఎందుకంటే.. ఇది ఒక ‘వంచన’ కార్యక్రమమని నాతో చెప్పారు’’ అని తేజ్ ప్రతాప్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై ఇంతవరకూ రాజకీయ నాయకులు స్పందించలేదు కానీ, నెటిజన్ల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు.. ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా తేజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సి ఉంది.
ఇదిలావుండగా.. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి.. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వాడుకుంటోందని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. జనవరి 22వ తేదీన రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కొన్ని వేలమంది ప్రముఖులు హాజరుకాబోతున్నారు.