కాంగ్రెస్.. శంకుస్థాపనల స్పెషలిస్ట్!
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:34 AM
గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంలో ఆ పార్టీ స్పెషలిస్టు అని ఎద్దేవా చేశారు. పునాది రాళ్లు వేసినా..

ప్రాజెక్టులు 35-40 ఏళ్లు ఆలస్యం
మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోదీ ధ్వజం
నదుల అనుసంధాన ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఖజురహో, డిసెంబరు 25: గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంలో ఆ పార్టీ స్పెషలిస్టు అని ఎద్దేవా చేశారు. పునాది రాళ్లు వేసినా.. ప్రాజెక్టులను 35-40 ఏళ్లు ఆలస్యం చేసిందని.. ఉత్తుత్తి ప్రకటనలు మాత్రమే చేస్తుందని.. ప్రజాప్రయోజనాలు దానికి పట్టవని ధ్వజమెత్తారు. బుధవారం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కెన్-బెత్వా నదుల అనుసంధానానికి ఆయన శంకుస్థాపన చేశారు. దేశంలో జలసంరక్షణ చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని.. ముఖ్యంగా బుందేల్‌ఖండ్ వంటి ప్రాంతాల్లో రైతుల అవసరాలను గుర్తించడంలో విఫలమయ్యాయని ఈ సందర్భంగా జరిగిన సభలో చెప్పారు. అంబేడ్కర్‌ను అమిత్‌షా అవమానించారంటూ ఉద్యమిస్తున్న కాంగ్రె్‌సపై మండిపడ్డారు. దేశ జలసంరక్షణ విధానాల రూపకల్పనలో అంబేడ్కర్ పాత్ర చాలా ఉందని, నేడు కేంద్ర జలసంఘం ఉనికి ఉందంటే ఆయన చొరవ, దూరదృష్టే కారణమని చెప్పారు. ఆయన కృషిని కాంగ్రెస్ ఏనాడూ గుర్తించలేదని, ఆయనకు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదని ఆక్షేపించారు. ‘అధికారం తన జన్మహక్కు అని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ సత్పరిపాలన అందించడంలో విఫలమైంది.
శంకుస్థాపనలు చేసిన తర్వాత దశాబ్దాలపాటు ప్రాజెక్టుల జోలికి వెళ్లలేదు. కాంగ్రెస్, ప్రభుత్వం కలిసి సాగవు’ అని వ్యాఖ్యానించారు. నీటి కొరతను నివారించడానికి నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ 21వ శతాబ్దిలో సమృద్ధిగా నీరు, నీటి ప్రాజెక్టుల సమర్థ నిర్వహణ ఉన్న దేశాలే ముందుకెళ్తాయన్నారు. మధ్యప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి కోసం 1,153 అటల్ గ్రామ సేవాసదన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ బెత్వా, కెన్ నదుల జలాలను రెండు కలశాల్లో ఆయనకు అందజేశారు. ఆ నీటితో అనుసంధాన ప్రాజెక్టు నమూనాను ఆయన అభిషేకించారు.
వాజపేయికి ప్రధాని నివాళి
మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని ‘సదైవ్ అటల్’(వాజపేయి స్మారకం పేరు) వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని మోదీ తదితర ప్రముఖులు నివాళులర్పించారు. వాజపేయి రాజ్యాంగ విలువలకు కట్టుబడిన తీరు ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఈ సందర్భంగా అన్నారు. సదైవ్ అటల్ వద్ద వాజపేయికి నివాళులర్పించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. వాజపేయి దూరదృష్టి వల్లే భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని ఆయన అన్నారు.