ABN Effect: ఆ పని కోసం వెంటనే నిధులు మంజూరుకు మంత్రి గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Dec 03 , 2024 | 07:05 PM
చినుకులు పడితే చాటు మట్టి రోడ్లు బురదమయం, జోరుగా వాన పడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నేటికీ గిరిజన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా గిరిజన ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం ఆదివాసీ తండాలు ఎలా ఉన్నాయనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి ..

ప్రభుత్వాలు మారిన గిరిజన గ్రామాల్లో ప్రజలకు డోలీమోత కష్టాలు తీరడంలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా ఆదివాసీ తండాలకు ఇప్పటికీ సరైన రహదారులు లేని పరిస్థితి నెలకొంది. చినుకులు పడితే చాటు మట్టి రోడ్లు బురదమయం, జోరుగా వాన పడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నేటికీ గిరిజన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా గిరిజన ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం ఆదివాసీ తండాలు ఎలా ఉన్నాయనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువు గ్రామానికి చెందిన శ్రావణికి పురిటి నొప్పులు మొదలవ్వడంతో స్థానికులు ఆమెను డోలీలో మోసుకుని ఆస్పత్రికి తరలించారు. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఏరులో నుంచే గర్భిణి శ్రావణిని ఆసుపత్రికి మోసుకెళ్లారు. దీనికి సంబంధించిన కథనం ఎబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచారం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎబీఎన్ కథనానికి స్పందించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు.
తక్షణమే స్పందించిన మంత్రి
ఎబిఎన్‌లో ప్రసారమైన కథనంపై ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. డోలీలో గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటనపై అధికారులను వివరాలు అడగగా గత వైసీపీ ప్రభుత్వంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో సగం రోడ్డు మాత్రమే వేసినట్లు మంత్రికి అధికారులు నివేదిక ఇచ్చారు. శ్రావణి అను మహిళ డెలివరీ అయ్యిందని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని మంత్రికి అధికారులు తెలిపారు. తక్షణమే స్పందించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ అధికారులను శ్రావణికి స్వగ్రామానికి పంపించి తల్లి, బిడ్డలను పరామర్శించి అవసరమైన సహాయం చేయాలని మంత్రి ఆదేశించారు.
రహదారి నిర్మాణానికి నిధులు
తక్షణమే రహదారి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తిచేసి ప్రజల కష్టాలు తీరుస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు ఇటువంటి కష్టాలు పడకుండా చూడాలని కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, రహదారుల నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గిరిజన ప్రాంతాల ప్రజలు తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న సందర్భాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here