Retired IPS AB Venkateswara Rao: చట్టమంటే ఏమిటో తెలిసేలా చేస్తా
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:33 AM
‘నికార్సైన పోలీసుగా పనిచేశా.. చట్టంపై నమ్మకంతో చెబుతున్నా.. అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి నిజం చేయాలనే విష సంస్కృతికి పాల్పడుతోన్న జగన్ పత్రిక..

జగన్ పత్రికపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ ఫైర్
అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘నికార్సైన పోలీసుగా పనిచేశా.. చట్టంపై నమ్మకంతో చెబుతున్నా.. అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసి నిజం చేయాలనే విష సంస్కృతికి పాల్పడుతోన్న జగన్ పత్రిక, మరో యూట్యూబ్ చానల్‌కు చట్టమంటే ఏమిటో తెలిసేలా చేస్తా’ అని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. ఏబీవీపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన తప్పుడు కేసులను ఇటీవల కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో జగన్ సొంత మీడియా విషం చిమ్ముతూ ఫోన్ ట్యాపింగ్ కేసులంటూ రోత రాతలు రాసింది. మరో యూట్యాబ్ చానల్ కూడా ఇదే విధంగా ప్రసారం చేయడంతో ఏబీవీ పరువునష్టం దావాకు సిద్ధమయ్యారు. అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేయాలనే విష సంస్కృతి, వికృత ఆలోచనల నుంచి కొన్ని మీడియా సంస్థలు బయటికి రాలేదని, అది వారి జీవన విధానం, బతుకుతెరువని ఎద్దేవా చేశారు. తనపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ అంశమే లేదని స్పష్టం చేశారు. ఆరోపణలకు, కేసుకు, విచారణకు తేడా తెలియకుండా తనపై బురద చల్లుతున్న జగన్ పత్రికకు చట్టం అంటే ఏమిటో తెలిసేలా చేస్తానని మంగళవారం ‘ఎక్స్’లో ఏబీవీ హెచ్చరించారు.