America : టీచర్‌పై కాల్పులు జరిపిన ఆరేళ్ల బాలుడు

ABN , First Publish Date - 2023-01-26T18:04:58+05:30 IST

అమెరికాలోని వర్జీనియా, న్యూపోర్ట్ న్యూస్‌లో ఉన్న రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌ (Richneck Elementary School)లో దారుణం జరిగింది.

America : టీచర్‌పై కాల్పులు జరిపిన ఆరేళ్ల బాలుడు
School in Virginia, America

వాషింగ్టన్ : అమెరికాలోని వర్జీనియా, న్యూపోర్ట్ న్యూస్‌లో ఉన్న రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌ (Richneck Elementary School)లో దారుణం జరిగింది. ఆరేళ్ల విద్యార్థి తన టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ బాలుడి వల్ల ప్రమాదం పొంచి ఉందని టీచర్లు, విద్యార్థులు మొరపెట్టుకున్నప్పటికీ, ఆ పాఠశాల యాజమాన్యం సకాలంలో చర్యలు తీసుకోలేదు. దీంతో బాధితురాలు ఆ పాఠశాల యాజమాన్యంపై దావా వేయాలని నిర్ణయించుకున్నారు.

అబిగెయిల్ జ్వెర్నెర్ (25) అనే టీచర్‌ తరపు న్యాయవాది డియానే టోస్కనో మీడియాతో మాట్లాడుతూ, ఆరేళ్ళ బాలుడి వద్ద తుపాకీ ఉందని తన క్లయింట్‌తోపాటు కొందరు టీచర్లు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. తన క్లయింటు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. జనవరి ఆరున ఈ సంఘటన జరిగినట్లు వివరించారు.

నిందితుడు అంతకుముందు తన తోటి విద్యార్థిని బెదిరించాడని తన క్లయింట్ ఆ పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళారన్నారు. మరో గంట తర్వాత మరో ఇద్దరు టీచర్లు కూడా ఇదే విధంగా ఫిర్యాదు చేశారన్నారు. ఆ బాలుడి వద్ద తుపాకీ ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారన్నారు. స్కూల్ బ్యాగులో తుపాకీ కనిపించలేదని, అయితే అతని జేబుల్లో తుపాకీ ఉండి ఉండవచ్చునని చెప్పారన్నారు. ఓ విద్యార్థి ఏడుస్తూ వచ్చి, ఆ బాలుడి వద్ద తుపాకీ ఉందని, తనను బెదిరించాడని చెప్పాడన్నారు.

ఇన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ఆ బాలుడిని సోదా చేసేందుకు పాఠశాల యాజమాన్యం అంగీకరించలేదన్నారు. బాలబాలికలు చూస్తూండగానే ఆ బాలుడు తన క్లయింట్‌పై కాల్పులు జరిపాడన్నారు. ఆమె ఛాతీలోకి తూటాలు వెళ్ళాయని, శస్త్ర చికిత్స అనంతరం ఆమె ఇంట్లో కోలుకుంటున్నారని చెప్పారు.

ఇదిలావుండగా, న్యూపోర్ట్ న్యూస్ అధికారులు స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ జార్జ్ పార్కర్-3ని ఉద్యోగం నుంచి తొలగించారు. పాఠశాల బోర్డు మాత్రం ఆయనను ప్రశంసించింది.

నిందితుడు తన తల్లి వద్దనున్న తుపాకీని పాఠశాలకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే అతని తల్లిదండ్రులు విడుదల చేసిన ప్రకటనలో తమ కుమారుడు తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అతనితోపాటు పాఠశాలకు, తరగతిలోకి వెళ్తుంటామని తెలిపారు. ఈ దుర్ఘటన జరిగిన వారమే తాము అతనితోపాటు వెళ్లలేదని తెలిపారు.

అయితే, నిందితుడు మైనర్ కావడం వల్ల అతనిపై కేసు నమోదయ్యే అవకాశం లేదు. అతనికి తుపాకీని అందుబాటులో ఉంచినందుకు అతని తల్లిదండ్రులపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-26T18:05:02+05:30 IST