నేటి నుంచి తొలి దశ ‘జనగణన 2027’..
ABN , Publish Date - Apr 01 , 2026 | 08:09 AM
దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి తొలి దశ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ భవిష్యత్తు ప్రణాళికలకు అత్యంత కీలకమైన 'జనగణన 2027' ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ భారీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇది దేశవ్యాప్తంగా జరిగే 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వది. దీనికి గురించి భారత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ పలు విషయాలను వెల్లడించారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారని, ఏ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదని ఆయన స్పష్టం చేశారు.
రెండు దశల్లో జనగణన 2027:
ఈసారి జనాభా లెక్కలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో గృహగణన, వ్యక్తిగత వివరాల నమోదు ప్రక్రియ ఉంటుంది. రెండొవ దశలో జనాభా గణన చేపడతారు. ఈ రెండవ దశలోనే కులాల గణన కూడా జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. జనగణన 2027లో భాగంగా ప్రజలు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే 'సెల్ఫ్-ఎన్యుమరేషన్' సౌకర్యం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ఈ గడువు మారుతూ ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో:
గృహ గణన కార్యక్రమం ఏపీలో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో అదే నెల 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుంది. దీనికి 15 రోజుల ముందు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్‌లో ప్రజలు తమ గృహ సంబంధ వివరాలను స్వయంగా నమోదు చేయొచ్చు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా మొత్తం 16 భారతీయ భాషల్లో వివరాల నమోదు కార్యక్రమం జరుగుతుంది. జనగణన 2027 పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని నారాయణ్ తెలిపారు. డేటాను మొబైల్ అప్లికేషన్ ద్వారా సేకరిస్తారు. అలాగే ఈ జనగణన ప్రక్రియను పర్యవేక్షించడానికి వెబ్ ఆధారిత పోర్టల్‌ను ఉపయోగిస్తారు. ప్రజలు తమకు కేటాయించిన 15 రోజుల విండోలో se.census.gov.in పోర్టల్‌లో మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తొలి దశలో అడిగే 33 ప్రశ్నల జాబితాను ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలూ చదవండి:
రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం
వామ్మో.. విమానాల్లో కూడా జనాలు ఇంతేనా! ఫొటోలు వైరల్