తుర్కియే పార్లమెంట్‌లో ఎంపీల పిడిగుద్దుల వర్షం.. వీడియో వైరల్
ABN , Publish Date - Feb 12 , 2026 | 04:01 PM
తుర్కియే పార్లమెంటులో సభ్యులు రచ్చ చేశారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణల్లో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ అనగానే గుర్తొచ్చేది ప్రజా సమస్యలపై చర్చించే ఓ గొప్ప వేదిక. అలాంటి పార్లమెంట్ యుద్ధ భూమిని తలపించింది. ఎంపీలు పరస్పరం దాడి చేసుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పార్లమెంట్‌లో బాక్సింగ్ పోటీలు పెట్టినట్లు అనిపించింది. ఈ ఘటనకు తుర్కియే పార్లమెంట్(Turkey Parliament) భవనం వేదికైంది. మరి.. అంతలా ఫైటింగ్ చేసుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన అకిన్ గుర్లెక్ (Akin Gurlek)ను కొత్త న్యాయశాఖ మంత్రిగా ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్గోగాన్ నియమించారు. బుధవారం నాడు గుర్లెక్ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన ప్రమాణస్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష ఎంపీలు పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఇదే సమయంలో తాము ఏమి తక్కువ కాదంటూ అధికార పార్టీ ఎంపీలూ ప్రతిపక్ష సభ్యులను అడ్డుకునేందుకు పోడియం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎంపీలు పరస్పరం తోసుకుంటూ దాడి చేసుకున్నారు. కొందరు ఎంపీలు అయితే కిక్ బాక్సింగ్ పోటీలకు ప్రాక్టీస్ అన్నట్లుగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో చాలా సమయం పాటు పార్లమెంట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని స్పీకర్ కాసేపు వాయిదా వేశారు. చివరకు అధికార పార్టీ నేతలు గుర్లెక్ చుట్టూ రక్షణగా నిలబడి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఘర్షణ ఎందుకంటే..
న్యాయమంత్రిత్వ శాఖకు అధిపతిగా ఉన్న గుర్లెక్ నియామకంపై ప్రధాన ప్రతిపక్షం రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ (CHP) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అతడు ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులతో సంబంధం ఉన్న అనేక కేసులను ఆయన పర్యవేక్షించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడానికే ఈ నియామకం చేపట్టారని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపణలు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
బంగ్లాదేశ్‌లో మరో ఘోరం.. హిందూ వ్యక్తి దారుణ హత్య..
సభలో వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన