ఇద్దరిని బలిగొన్న ‘రీల్స్ వ్యామోహం’
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:39 PM
‘రీల్స్ వ్యామోహం’ రెండు ప్రాణాలను బలిగొంది. రీల్స్ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి చెందగా, తీవ్ర మనస్తాపంతో అతని ప్రియురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
రైలు ఢీకొని యువకుడి మృతి
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
చెన్నై: ‘రీల్స్ వ్యామోహం’ రెండు ప్రాణాలను బలిగొంది. రీల్స్ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి చెందగా, తీవ్ర మనస్తాపంతో అతని ప్రియురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అయనావరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా... అయనావరం చోళైఅమ్మన్ ఆలయ వీధికి చెందిన డ్రైవర్ జగదీశన్‌కు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె సుబ్బుసౌమ్య (20) అన్నాసాలైలోని కళాశాలలో చదువుతుండగా, రెండవ కుమార్తె 6వ తరగతి చదువుతోంది.
భార్య మృతి చెందడంతో జగదీశన్ ఇద్దరు కుమార్తెలను అన్నీ తానై పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో సౌమ్య సోమవారం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన చిన్న కుమార్తె పలుమార్లు తలుపు తట్టినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. చుట్టపక్కల వారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోనికెళ్లి చూడగా, అప్పటికే సౌమ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంపై పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. స్థానిక కీల్పాక్కం శాస్త్రి నగర్‌కు చెందిన సతీష్‌కుమార్ (22), సౌమ్య గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ నెల 4న సతీష్‌కుమార్ చెట్‌పేట్‌లో పరుగులు తీసే రైలు ముందు నిలబడి ‘రీల్’ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే యత్నంలో అతను తీవ్రంగా గాయపడి, కీల్పాక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6వ తేదీ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన సౌమ్య ఏడుస్తూ ప్రియుడి మృతదేహాన్ని చూసేందుకు వెళ్లబోయింది. ఇందుకు తండ్రి అనుమతించలేదు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపంతో వున్న సౌమ్య.. బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!
Read Latest Telangana News and National News