Share News

Vantalu: వేఢమిక అనే ప్రాచీన పరాటా..

ABN , Publish Date - Jun 22 , 2025 | 12:21 PM

భావప్రకాశ అనే వైద్యగ్రంథంలో ‘వేఢమికా’ అనే వంటకం గురించి ఉంది. మినప్పిండిని గారెల పిండిలాగా గట్టిగా ముద్ద అయ్యేలా రుబ్బి గోధుమ పిండితో వత్తిన పూరీ మధ్య పూర్ణంలా వుంచి, మూసి బొబ్బట్టు వత్తినట్టు గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చినదివేఢమిక.

Vantalu: వేఢమిక అనే ప్రాచీన పరాటా..

‘‘మాషపిష్టకయా పూర్ణగర్భా గోధుమచూర్ణతః

రచితా రోటికా సైవ ప్రోక్తా వేఢమికా బుధైః’’

భావప్రకాశ అనే వైద్యగ్రంథంలో ‘వేఢమికా’ అనే వంటకం గురించి ఉంది. మినప్పిండిని గారెల పిండిలాగా గట్టిగా ముద్ద అయ్యేలా రుబ్బి గోధుమ పిండితో వత్తిన పూరీ మధ్య పూర్ణంలా వుంచి, మూసి బొబ్బట్టు వత్తినట్టు గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చినదివేఢమిక.

ఈ పూర్ణాన్నినూనెలో వేయిస్తే అది పూర్ణ పోలీ. వత్తి నూనెలో వేగిస్తే అది సొజ్జప్పం. కానీ, బంగారపు గొలుసులో మణిమాణిక్యాలు పొదిగినట్టు గోధుమపిండిలో మినప్పిండిని పొదిగి, గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చిన ‘వేఢమిక’ ఓ అద్భుత వంటకం. తీపిలేని బొబ్బట్టు లేదా ఆలూపరాటాల కన్నా మెరుగైన వంటకం. అరబిక్‌ ‘ముసహబా’, పంజాబీ ‘పరాటా’లకు ఇది దక్షిణాది వారి ప్రాచీన రూపం.


ఆరోగ్యవంతమైన ఆహార ఉద్యమంలో భాగంగా, సంప్రదాయ వంటల పునరుద్ధరణ ప్రయత్నానికి అండగా, పాఠశాలల్లో పోషకాహారాల ఆలోచనలకు ఆలంబనగా వేఢమికను పరిశీలిద్దాం!

‘‘భవే ద్వేఢమికా బక్ల్యా వృష్యా రుచ్యాః అనిలాపహా/

ఉష్ణా సంతర్పణీ గుర్వే బృంహణీ శుక్రలా పరమ్‌

భిన్నమూత్రమలా స్తన్య మేదః

పిత్తకఫప్రదాబ గుదకీలార్దిత

శ్వాస పంక్తి శూలాని నాశయేత్‌బబ’’

ఈ శ్లోకాల్లో చాలా విలువైన సమాచారం ఉంది. మామూలుగా మనం ఇంట్లో చేసుకునే మినపట్టు పిత్త కఫాల్ని తగ్గించినా వాతం చేస్తుందని భావప్రకాశ గ్రంథం వివరించింది. కానీ, గోధుమపిండిలో పొదిగిన మినప్పిండితో కాల్చిన అట్టు వలన మినపట్టుకి లేని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి గమనించండి.


1. బక్ల్యా = ఇది బలకరం. నీరసించినవారికి తక్షణ శక్తినిస్తుంది.

2. వృష్యం = లైంగికపరమైన, దాంపత్య పరమైన సంతానపరమైన సమస్యల మీద పనిచేస్తుంది.

3. అనిలాపహా = కీళ్ళవాతం, పక్షవాతం లాంటి వ్యాధులతో బాధపడేవారికి ఇది వాతాన్ని అదుపు చేస్తుంది.

4. ఉష్ణా సంతర్పణీ గుర్వే = కొద్దిగా వేడి చేస్తుంది, తనివి, తృప్తినిస్తుంది. కొద్దిగా తింటే కడుపు నిండినట్టు ఉంటుంది.

5. బృంహణీ = శరీరంలోని ధాతువుల్ని బలపరిచే ఔషధం.

6. శుక్రలా = పురుషుల్లో బీజకణాలవృద్ధికి తోడ్పడుతుంది.

7. భిన్న మూత్రమలా = మలమూఝ్ర్తాలు ఫ్రీగా అయ్యేలా చేస్తుంది.

8. స్తన్య = బాలింతలకు పాలు పెరిగేలా చేస్తుంది. ప్రసవానంతరం వాతం కమ్మకుండా కాపాడుతుంది


9. మేదః = చిక్కిపోతున్న పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

10. పిత్త, కఫ ప్రదా =ఎక్కువగా తింటే కఫాన్ని పైత్యాన్ని పెంచుతుంది.

11. గుదకీల = మొలల వ్యాధి ఉన్నవారికి మేలు చేస్తుంది.

12. అర్దిత = ఆర్త్రయిటిస్‌ లాంటి కీళ్ల వాపు వ్యాధులున్నవారు తప్పనిసరిగా తినవలసిన పదార్థం.

13. శ్వాస = ఉబ్బస రోగులు మామూలు మినపట్టు కన్నా ఇది తినటం మంచిది.


14. పరిణామశూల = కడుపులో అల్సర్లున్న వాళ్లకు నేతితో కాల్చిన ఈ వేఢమిక ఉపయోగపడుతుంది.

సాధారణ పరాటాల కన్నా తక్కువ నూనెతో తయారు చేయవచ్చు. ప్రయాణాల్లో తీసుకెళ్ల డానికి అనుకూలం. పాఠశాల పిల్లల లంచ్‌ బాక్స్‌కు చక్కటి వంటకం. మధ్యాహ్న భోజన పథకంలో రాగి పిండితో తయారు చేసి పోషకాహారంగా వడ్డించవచ్చు. భోజనంలో మొదటగా వేఢమిక ఒకట్రొండు తింటే ఆమేరకు వరి అన్నం తినటం తగ్గుతుంది. ఇది షుగరు, స్థూలకాయ బాధితులకి శ్రేయస్కరం.

దీనిమీద మనసుపెట్టండి! మరిచిపోయిన ఆత్మీయ వంటకాల్ని వంటగదిలోకి పునః స్వాగతం పలుకుదాం!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


పైనాపిల్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: పైనాపిల్‌ ముక్కలు-కప్పు, చింతపండు రసం- పావు కప్పు, బెల్లం-అయిదు స్పూన్లు, పసుపు-అర స్పూను, నువ్వులు- రెండు స్పూన్లు, ఎండు మిర్చి-ఆరు, మినప్పప్పు-రెండు స్పూన్లు, మెంతులు- అర స్పూను, కరివేపాకు రెబ్బలు-కొన్ని, పచ్చి కొబ్బరి-ముప్పావు కప్పు,ఆవాలు -స్పూను, నూనె-తగినంత, పోపు గింజలు-స్పూను, ఉప్పు, నీళ్ల్లు-తగినంత.

book8.2.jpg

తయారుచేసే విధానం: నువ్వులు, మినప్పప్పు, మెంతులు, ఎండిన మిర్చిని వేయించి, చల్లారాక మిక్సీలో పొడిలా చేయాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి, కాస్త నీళ్లు వేసి పేస్టులా రుబ్బుకోవాలి. పైనాపిల్‌ ముక్కల్ని నీళ్లలో పది నిమిషాలు ఉడికించి, నీటిని వడగట్టాలి. ఓ బాణలిలో చింతపండు రసం, బెల్లం, పసుపు, ఉప్పు, పైనాపిల్‌ ముక్కలూ వేసి అంతా కలపాలి. అయిదు నిమిషాల తరవాత కొబ్బరి మసాలా, అవసరమైతే కాస్త నీళ్లనీ కలిపి తక్కువ మంట మీద ఉడికించాలి. అంతా దగ్గరవుతుంటే పోపు పెడితే పైనాపిల్‌ కర్రీ తయారు.


మల్టీగ్రెయిన్‌ ఛీలా

కావలసిన పదార్థాలు: మైదా-పావు కప్పు, గోధుమ పిండి- పావు కప్పు, రాగి పిండి-పావు కప్పు, పెరుగు-అర కప్పు, మిరియాల పొడి - పావు స్పూను, ఉప్పు-అర స్పూను, బేకింగ్‌ పౌడరు-అర స్పూను, పచ్చి బఠానీలు - అర కప్పు, క్యాప్సికమ్‌, క్యారెట్‌ ముక్కలు - అర కప్పు, స్వీట్‌కార్న్‌-అర కప్పు, కొత్తిమీర - రెండు స్పూన్లు, నూనె - తగినంత.

తయారుచేసే విధానం: ఓ గిన్నెలో వివిధ రకాల పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, మిర్యాలపొడి, స్వీట్‌కార్న్‌, కూరగాయలు, కొత్తిమీర, పచ్చి బఠానీలు అన్నీ కలపాలి. పెరుగు కూడా చేర్చి, మూతపెట్టి అయిదు నిమిషాలు పక్కనపెట్టాలి. బాణలిలో కాస్త నూనె వేసి అరచేయంత దోశలా పిండిని వేసి దోరగా కాలిస్తే మల్టీగ్రెయిన్‌ ఛీలా తయారు. మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 12:21 PM