Share News

శాకనాయకం... వంకాయ

ABN , Publish Date - May 25 , 2025 | 01:07 PM

వంగపువ్వు పూయగానే శుభదినం అని దీపారాధన చేస్తారు. ‘క్షేమకుతూహలంలో’ క్షేమశర్మ శాకజాతులన్నింటిలో వంకాయను శాక నాయకం అనీ, కూరగాయల్ని చెప్పేటప్పుడు వంకాయతో మొదలు పెట్టాలనీ అన్నాడు.

శాకనాయకం... వంకాయ

సర్వాసాం శాకజాతీనాం వృంతాకం

శాకనాయకంబ

అతః శాకక్రమం త్యక్త్వాప్రథమం

నాయకం వదేత్‌..

సహనం, పరిపక్వత ప్రేమలకు వంకాయ ప్రతీక! తెలుగింట పెళ్లిళ్ళలో వంకాయకూర తప్పనిసరి కాబట్టి, పితృకార్యాల్లో వండరు. ప్రహ్లాదుడు ఉగ్రనరసింహుని శాంతింప చేసేందుకు వంకాయకూర సమర్పించాడట! వార్తాకి అనే గ్రామదేవత ఆరాధన కూడా ఉంది. వార్తాకం అంటే వంకాయ. వంకాయ వ్రతం కూడా ఉంది. వంగపువ్వు పూయగానే శుభదినం అని దీపారాధన చేస్తారు.

‘క్షేమకుతూహలంలో’ క్షేమశర్మ శాకజాతులన్నింటిలో వంకాయను శాక నాయకం అనీ, కూరగాయల్ని చెప్పేటప్పుడు వంకాయతో మొదలు పెట్టాలనీ అన్నాడు. వంకాయలేని భోజనం, తొడిమలేని వంకాయ, తగినంత నూనె, ఇంగువ లేని వంకాయకూర వ్యర్థాలన్నాడు. అమెరికాలో మొన్నమొన్నటి దాకా వంకాయని క్రోటన్‌ మొక్కగానే పెంచారు. ఉమ్మెత్త జాతికి చెందిందని తినటానికి జంకే వారు.


కూరగాయల్ని గ్రాహ్యశాకం (తినదగినవి), విరుచ్యసంయోజిత శాకం (పరిపక్వమృదుత్వం కలిగినవి), అగ్రాహ్యశాకం (తినటానికి పనికి రానివి) అని మూడు రకాలుగా వర్గీకరించారు! వంకాయ విరుచ్యసంయోజిత శాకం! వంకా యకూరని ఎన్ని రకాలుగా వండుకోవచ్చో క్షేమకుతూహలం పాకశాస్త్ర గ్రంథం వివరించింది.

వంకాయ ముక్కల్లో పులిసిన గంజి పోసి తేలికగా ఉడికించి, అల్లం, ధనియాల పొడి, పసుపు చేర్చి, నేతితో ఇంగువ తాలింపు పెట్టిన వంకాయకూర జీర్ణశక్తిని కలిగిస్తుంది. పులిసిన గంజి వంకాయ మృదుత్వాన్ని పెంచి, అల్లం ధనియాల సహకారంతో చెక్కలా బిగుసుకు పోయిన పొట్టలో కూడా ఆకలిని రేకెత్తిస్తుంది.

ఒక భాండీలో కొద్దిగా నూనె తీసుకుని వంకాయ ముక్కల్ని తరిగి వేసి, ఇంగువ కరిగించిన నీళ్లు కూడా పోసి మూతబెట్టి మగ్గనిచ్చి మిరియాలపొడి వగైరా చేర్చి వంకాయ కూర చేసుకోవచ్చు.


ఆకుపచ్చ వంకాయల్ని సన్నగా పొడవుగా తరిగి ఇంగువ వేగించిన ఆవనూనె పట్టించి తగినంత మిరియాలపొడి వేసి వండిన వంకాయ కూర జీర్ణశక్తిని పెంచుతుంది.

వంకాయని చిన్న ముక్కలుగా తరిగి శొంఠి, ధనియాలు, జీలకర్ర, మిరియాలను వేగించి దంచిన పొడిని తగినంత కలిపి ఇంగువ తాలింపు పెట్టి వండిన వంకాయ కూర వాత వ్యాధుల్లో మంచిది.

వంకాయ తొడిమని ఉంచి నిలువుగా నాలుగు పక్షాలుగా కోసి ఇంగువ వేసిన నేతితో మగ్గబెట్టి, చుక్కకూర సైంధవలవణం, మిరి యాలపొడి వగైరా కలిపి వండిన వంకాయ గుత్తికూర రోటీలతో నంజుకోవటానికి బావుం టుంది. పూర్వజన్మ సుకృతం ఉన్నవారికే ఇది దొరుకుతుంది. ఇలాగే మామిడిగుజ్జు కలిపి వండిన వంకాయ మామిడి కూర తింటే, చాలాసేపు ఆ రుచి నాలుకమీదే నిలిచి ఉంటుంది.


కమ్మటి నెయ్యి వేసి వంకాయ ముక్కలు మగ్గబెట్టి, రుబ్బిన బియ్యపు పిండి, కొబ్బరి తురుము కలిపి వండిన వంకాయ కూర కడు పులో జాఠరాగ్నిని కార్చిచ్చులా రగిలిస్తుంది!

భాండీలో కొద్దిగా నూనె తీసుకుని వంకాయ ముక్కలు వేసి మెత్తబడేలా కాసిన్ని నీళ్లు పోసి ఉడికించి, ఇంగువ, నిమ్మరసం, అల్లం ఇతర సుగంధ ద్రవ్యాల గ్రేవీ, సైంధవలవణం కలిపి వండిన కూర భగవంతుడికి నైవేద్యం పెట్టదగినదిగా ఉంటుందన్నాడు.

వంకాయని నిప్పులపైన కాల్చి ఇంగువ, సైంధవలవణం, సుగంధద్రవ్యాలు కలిపిన వంకాయ బజ్జిపచ్చడిని భటిత్రికం అంటారు! ఇందులో పెరుగు కలిపినది పెరుగుపచ్చడి, చింతపండు రసం కలిపినది పచ్చిపులుసు.

వంకాయ గురించిన అనేక విశేషాలు క్షేమ కుతూహలంలో ఉన్నాయి. కేవలం అల్లంవెల్లుల్లి పేస్టు, టమాటాలతో సరిపెట్టకుండా ప్రాచీన పద్ధతిలో ఆరోగ్యదాయకంగా వంకాయని వండుకుంటే అందరూ నిర్భయంగా తినవచ్చు.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


పనీర్‌ ఖీర్‌

book11.2.jpg

కావలసిన పదార్థాలు: కిస్మిస్‌ - స్పూను, పాలు - మూడు కప్పులు, చక్కెర - పావు కప్పు, పనీర్‌ తురుము - అర కప్పు, యాలకుల పొడి - పావు స్పూను, నెయ్యి - స్పూను, జీడిపప్పులు - అయిదు.

తయారుచేసే విధానం: ఓ పెద్ద బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌ను దోరగా వేయించాలి. ఇందులోనే పాలు పోసి, తక్కువ మంటమీద మరిగించాలి. పాలు దగ్గరగా అవుతుంటే చక్కెర, పనీర్‌ను కలపాలి. అయిదు నిమిషాలు మరిగించి, స్టవ్‌ కట్టేయాలి. యాలకుల పొడి కలిపితే పనీర్‌ ఖీర్‌ తయారు.


గుమ్మడి, పాలకూర స్పగెట్టీ

కావలసిన పదార్థాలు: తియ్య గుమ్మడికాయ ముక్కలు - రెండు కప్పులు, స్పగెట్టీ - 200 గ్రాములు, ఆలివ్‌ ఆయిల్‌ - పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు - మూడు, పాలకూర - కట్ట, చిల్లీ ఫ్లేక్స్‌ - స్పూను, నిమ్మరసం - స్పూను, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, వాల్‌నట్స్‌ ముక్కలు - పావు కప్పు.

తయారుచేసే విధానం: తియ్య గుమ్మడి ముక్కల్ని, స్పగెట్టీని వేరువేరుగా ఉడికించి, నీటిని వడగట్టి పక్కనపెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనె వేసి పాలకూర, వెల్లుల్లిని వేయించాలి. చిల్లీ ఫ్లేక్స్‌ కూడా కలపాలి. గుమ్మడి ముక్కల్నీ జతచేయాలి. రెండు నిమిషాల తరవాత స్పగెట్టీ చేర్చి మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాల తరవాత స్టవ్‌ కట్టేయాలి. ఇందులో నిమ్మరసం, వాల్‌నట్స్‌ కలిపి వేడివేడిగా పిల్లలకి అందిస్తే సరి.


ఈ వార్తలు కూడా చదవండి.

భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి

Hyderabad Metro: పార్ట్‌-బీ మెట్రోకు డీపీఆర్‌ సిద్ధం

Read Latest Telangana News and National News

Updated Date - May 25 , 2025 | 01:07 PM